జగన్ పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారని, వారికోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఇంకా ఏమేమి చేయాలో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన తెలుగుదేశం పార్టీ… వారిని రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తిరిగి దళితులను అవమానించేలా దాడి చేయించిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా నేరుగా లబ్ధిదారుడికే సంక్షేమం అందిస్తున్నారని, పేదల కొనుగోలు శక్తి పెరిగిందని… దీనిపై తెలుగుదేశం పార్టీకి అంత బాధ ఎందుకని డొక్కా ప్రశ్నించారు.
జగన్ నాయకత్వాన్ని దళితులు విశ్వసిస్తున్నారని, విద్య-వైద్య రంగంతో పాటు ఇతర రంగాల్లో కూడా తమ వాటా కోసం వారు అడుగుతున్నారని, దాన్ని ఎలా ఇవ్వాలో తాము ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. మంత్రి సురేష్ అంతు చూస్తానంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై డొక్కా తీవ్ర అభ్యంతరం తెలిపారు, వెంటనే బాబు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు.
ప్రతిదానికీ తాడేపల్లి ప్యాలెస్ అంటూ వ్యాఖ్యానించడం సరికాదని, ప్రత్యక్షంగా జరిగిన గొడవను అందరూ చూశారని, లోకేష్ దళితులపై చేసిన వ్యాఖ్యలపై మీ వైఖరేమిటని బాబును అడిగారని, ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో రాళ్ళు విసిరింది టిడిపి వారేనని, ఇది వీడియోల్లో స్పష్టంగా కనబడుతోందని అన్నారు. మంత్రివర్గం మొత్తంలో అత్యదిక విద్యావంతుడు సురేష్ అని, ఆయన ఓ రాజకీయ డిమాండ్ చేస్తే దానికి సమాధానం చెప్పకుండా తాడేపల్లి అంటూ మాట్లాడడం దారుణమని డొక్కా అన్నారు.