తెలంగాణలో ముస్లింలకు అమలు చేస్తున్న అనధికార రిజర్వేషన్లను తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత అమిత్ షా ప్రకటించారు. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్‍టీ, బీసీలకు కేటాయిస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వేదికగా ఆదివారం సాయంత్రం జరిగిన విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించారు. ఈ సందర్భంగా అమిత్ శ మాట్లాడుతూ కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. ఓవైసీ అజెండాను తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తోందని ఆరోపించారు.
10వ తరగతి పేపర్ లీకేజీ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ను అరెస్ట్ చేయడం పట్ల అమిత్ షా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు అరెస్టులకు భయపడరని, పోరాడుతూనే ఉంటారని అన్నారు. “జైలులో పెడితే భయపడతారని ఆయన (కేసీఆర్) అనుకుంటున్నారు. కేసీఆర్ విను.. మీ వేధింపులకు మా కార్యకర్తలు అసలు భయపడరు. మిమ్మల్ని గద్దె దింపే వరకు మా పోరాటం అసలు ఆగదు” అని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో పోలీసులను పూర్తిగా రాజకీయంగా మార్చేశారని ఆయన ఆరోపించారు.
టీఎస్‍పీఎస్‍సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. యువత జీవితాలతో సీఎం కేసీఆర్ ఆడుకుంటున్నారని, పేపర్ లీకేజీపై మౌనంగా ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులను బీఆర్ఎస్ పార్టీ దోచుకుంటోందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలు సామాన్య ప్రజలకు అందకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని అమిత్ షా ఆరోపించారు.