Drought is the world next big climate disaster – Drought During Pandemic
రాయలసీమలో కరువు పిలవని బంధువు. కవులు, రచయితలు, పాత్రికేయులు రెండు శతాబ్దాలుగా కరువు బాధలను ఏకరువు పెడుతూనే ఉన్నారు. డొక్కల కరువులు, గంజి కరువులు, నీళ్ల కరువులు…ఇలా పారిభాషిక పదాలకు కరువులేకుండా పేర్లు పెట్టారు.
“క్షామములెన్ని వచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞానామృత వృష్టికిన్ కొరత నంద దనంత పురంబు చూడుడీ’’
అని అక్కడి కవులే కరువు బాధలో కూడా మీసం మెలేసి గర్వంగా చెప్పుకున్నారు. నీళ్లకే కరువు కానీ- సాహిత్యానికి, రసజ్ఞతకు కరువు లేదట. శెభాష్.
స్వాతంత్య్రం వచ్చిన పదేళ్లకు 1957 లో విద్వాన్ విశ్వం పెన్నేటి పాట పద్య కావ్యం రాశాడు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అపార పాండిత్యం ఉన్నవాడు. జర్నలిస్టుగా దశాబ్దాలపాటు తన రచనలతో మాణిక్యవీణలను పలికించినవాడు. అనేక సంస్కృత నాటకాలు, కావ్యాలను తెలుగులోకి అనువదించినవాడు. సాహిత్యాన్ని సామాజిక కోణంలో అధ్యయనం చేసి అమృతతుల్యమయిన రచనలు చేసినవాడు. రాసిన ప్రతి మాటలో అందచందాలను పట్టి బంధించినవాడు. సాహిత్యంలో మానవత్వాన్ని దీపంగా వెలిగించిన వాడు. సాహితీ విమర్శకుల్లో ఎవరెస్టు శిఖర సమానుడయిన రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ వంటి వారి ప్రశంసలు పొందినవాడు. తర్క శాస్త్రాన్ని చదివి తన రచనల్లో ఆ తర్కాన్ని ఇముడ్చుకున్నవాడు. అలాంటి విశ్వం ఎన్నో కావ్యాలు రాసినా…పెన్నేటి పాట ఆయనకు అజరామరమయిన కీర్తిని సంపాదించి పెట్టింది.
పొరుగున కర్ణాటకలో నంది కొండల్లో పుట్టిన పెన్న నెల్లూరు దగ్గర సముద్రంలో కలుస్తుంది. పెన్న ఎప్పుడు పుట్టిందో కానీ…విద్వాన్ విశ్వం పెన్నేటి పాట రాసిన తరువాత పెన్న కొత్తగా పుట్టింది. లోకానికి పరిచయమయ్యింది. నీరింకిన పెన్నకు విశ్వం పెన్నేటి పాట సిగ్నేచర్ ట్యూన్ అయ్యింది. పెన్నేటి పాట అనగానే చాలామంది గంగావతరణంలా పాజిటివ్ గా అనుకుంటారు. ఇది పెన్న ఎలా పుట్టిందో చెప్పే పెన్నావతరణం కాదు. పెన్న ఎలా ఎండిందో, ఎలా మాడి మసై నామరూపాల్లేకుండా పోయిందో, ఆ పెన్న ఇరు గట్లలో పెన్నను నముకున్నవారు వెన్నెముకలేనివారుగా ఎలా కుంగిపోయారో చెప్పే విషాద కావ్యం.
పెన్న గట్టున నీటికోసం గుండెలు బాదుకునే కన్నీటి పాట. కన్నీళ్లు కూడా కరువై చెమట చుక్కలే పెన్న ఇసుకలో కాలువలు పారే పాట. ఎంత లోతు తవ్వినా చుక్క నీరు తగలని ఎడారి పాట. రాబందులు రెక్కవిప్పి పీనుగులను పీక్కు తినే కరువు పాట. అంతులేని బాధల్లో కన్నుగానని అనంతమయిన బాట – విశ్వం పెన్నేటి పాట. రాయలసీమలో అనంతపురం జిల్లాను దాటి విశ్వం పెన్నేటి పాట తెలుగు సాహిత్యమంతా కరువు గానం చేసింది. చేస్తోంది. చేస్తుంది.
“నీరులేని ఎడారిలో కన్నీరయిన తాగి బతకాలి” అన్నది కవి వాక్కు. అలా పెన్న దారంతా కన్నీరు తాగుతూనే బతుకుతూ ఉంటారు. తరతరాల కరువు ప్రవహించి, ప్రవహించి పెన్న చాలా చోట్ల నది రూపాన్ని, అస్తిత్వాన్ని కూడా కోల్పోయింది. కరువు పెన్నలో ఇంకిపోయింది. సాహిత్యంలో పెన్న ఇంకిపోయింది. ఒక విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది. కరువు గడ్డకట్టిన గేయంగా పెన్నేటి పాట వినిపిస్తూనే ఉంటుంది. కరడుగట్టిన గుండెనయినా కదిలిస్తూనే ఉంటుంది. గుండెలోతుల్లో కోటి గొంతుల కిన్నెర మీటుకుంటూ, కోటి కంజరలు కొట్టుకుంటూ పెన్నేరు తన బాధను పాటగా ఎవరు విన్నా, వినకపోయినా పాడుతూనే ఉంటుంది.అంతులేని కరువు బాధను ఇలా అనంతంగా పాడుకోవడంలో ఏదో నిస్సహాయత ఉంది. పరిష్కారం లేని వైరాగ్యమేదో ఉంది. వైరాగ్యంలో నుండి పుట్టిన నైరాశ్యమేదో ఉంది. నైరాశ్యంలో నుండి పుట్టిన నిర్వేదమేదో ఉంది. నిర్వేదం మిగిల్చిన కన్నీటి చారిక ఏదో ఉంది. కన్నీటికి పండని సీమ పొలాల నెర్రెల్లో పెన్నేరు పాడి పాడి గొంతు ఎండిపోయిన మౌన వేదన ఏదో ఉంది.
“ఎవెరిబడి లవ్స్ ఎ గుడ్ డ్రాట్” అని మంచి కరువును అందరూ ప్రేమిస్తారని ప్రఖ్యాత జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ గొప్ప వ్యాసం రాశారు. కరువు పేరుతో ఏవేవో చేస్తూ కరువును మాత్రం అలాగే భద్రంగా కాపాడుకునే మహా విషాదాన్ని ఆయన తనదయిన శైలిలో ప్రపంచానికి చూపించారు. వికలాంగ పిల్లలను చూపించి అడుక్కునే వారు ఎలా ఉంటారో అలాగే కరువును చూపించి అడుక్కునేవారుంటారని తొలిసారి ఆయన నిరూపించారు. ఇలాంటివారికి కరువు శాశ్వతంగా నిర్మూలన కావడం ఇష్టముండదు. ఆ కోణంలో “ఎవెరిబడి లవ్స్ ఎ గుడ్ డ్రాట్” వ్యాసం ఒక లోతయిన చర్చకు తెర లేపింది.
విశ్వం పెన్నేటి పాటలో కరువు, పాలగుమ్మి సాయినాథ్ చెప్పిన కరువును ప్రేమించే సిద్ధాంతం అర్థం చేసుకోవడానికి గుండె తడి ఉండాలి. మానవత్వం ఉండాలి. లేనివారి మీద జాలి ఉండాలి. ఆశలు ఆవిరయిన వారి గురించి పట్టింపు ఉండాలి.
సంవత్సరానికి పైగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే తీవ్రమయిన సమస్య మరొకటి ముంచుకొస్తోందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. అది కరోనాలాంటి మరో వైరస్ కాదు. కరువట. అయిదువేల ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమయిన కరువు భారత్ తో పాటు కొన్ని దేశాల మెడ మీద కత్తిలా వేలాడుతోందట. ఈ కరువు వల్ల ఆర్థికంగా ఎంత నష్టం కలుగుతుందో అప్పుడే అంచనాలు కూడా మొదలయ్యాయి.
Drought During Pandemic
కరువులో అధికమాసం.
కరోనాలో కరువు అత్యధిక మాసం.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read: