మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ గడువును రెండు నెలలపాటు పొడిగిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టి వేసింది. సదరు ఉత్తర్వులపై అసహనం వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఈ తీర్పు ఉందని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసులో మరికొన్ని కోణాలు బైటకు తీసుకు రావాల్సి ఉన్నందున విచారణ గడువును జూన్ 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో రేపు విచారణ ఉన్నందున అప్పటి వరకూ ఆయన్ను అరెస్టు చేయకుండా సిబిఅకి ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.