పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. టిఎస్ పిఎస్సి పేపర్ల లీకేజ్ కేసులో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను కలిసేందుకు ఈ ఉదయం లోటస్ పాండ్ లోని తన నివాసంనుంచి షర్మిల బయలుదేరగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె పోలీసులను నెట్టుకుంటూ వెళ్ళారు. ఈ సందర్భంలోనే కొందరు పోలీసులపై ఆమె అనుచితంగా ప్రవర్తించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంజారాహిల్స్ ఎస్ ఐ రవీందర్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 332,353 509,427 సెక్షన్స్ కింద షర్మిలపై కేసు నమోదు చేశారు.
ఈ సాయంత్రం ఆమెను నాంపల్లి కోర్టుకు తరలింఛి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదనను విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఆమెకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. మే 8 వరకూ ఆమెకు రిమాండ్ అమల్లో ఉంటుంది. కాగా, షర్మిల బెయిల్ పిటిషన్ ను ఆమె తరఫు లాయర్ దాఖలు చేయగా, దీనిపై విచారణను జడ్జి రేపటికి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు.