జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నామని, దేశ జనాభాలో 3 శాతం ఉన్నతెలంగాణా జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖలో 30 శాతం అవార్డులు గెల్చుకుందని తెలంగాణ ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటిఆర్ వెల్లడించారు. రెండ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వమే ఈ అవార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు. తండాలు, గిరిజన గూడేలను పంచాయతీలుగా చేసుకున్నామని, అక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, పల్లె ప్రగతి ద్వారా వస్తున్నమార్పులు ఇవి కాదా అని ప్రశ్నించారు.
ఆదివాసీ, గిరిజన బిడ్డలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఆయా వర్గాల విద్యావంతులకు సీఎం ఎస్టీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎంఎస్‌టీఈఐ) స్కీం వరంగా మారింది. ప్రపంచస్థాయి ప్రమాణాలున్న ప్రతిష్ఠాత్మక ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్వారా శిక్షణ ఇప్పించి, వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. 2018లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 300 మంది ఉన్నత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఊతమిచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో మరో 24మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సీఎంఎస్‌టీఈఐ యూనిట్లను కేటిఆర్ సహచర మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ సమాజంలో అన్ని కులమతాల మధ్య గీతలను కరోనా చెరిపివేసిందన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే కులవ్యత్యాసాలు రూపుమాసిపోతాయన్నారు.
“నిన్న ఒకాయన ఒచ్చాడు, ఏదేదో మాట్లాడాడు, ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కడూ మమల్ని వెంటనే అధికారంలో తెచ్చేయండి, కేసిఆర్ ను తీసి అవతల పారేయండి అంటారు” అంటూ ధ్వజమెత్తారు. ఇక్కడ తాము, అక్కడ బిజెపి అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు అవుతోందని, దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న ఒక్క రాష్ట్రాన్ని చూపించాలని తాను డిమాండ్ చేస్తే సమాధానం లేదని కేటిఆర్ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర తలసరి ఆదాయం లక్షా 24 వేల రూపాయలని, ఇప్పుడు అది 3 లక్షల 17 వేల రూపాయలని మంత్రి తెలిపారు. బారత దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణా నంబర్ వన్ గా నిలిచిందని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా చెప్పిందన్నారు. మనం 162 శాతం తలసరి ఆదాయం పెంచుకున్నప్పుడు మిగిలిన రాష్ట్రాలు ఎందుకు పెంచుకోలేకపోయాయని, అవికూడా మంచిగా అభివృద్ధి చెంది ఉంటే మనం ప్రపంచంలో చైనాతో పోటీ పడి ఉండేవారమని కేటిఆర్ వివరించారు.