మొదటి నుంచి సాయితేజ్ తెరపై మంచి ఎనర్జీని చూపిస్తూ వచ్చాడు. అలాగే తన సినిమాల్లో యూత్ కి .. మాస్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండేలా చూసుకుంటూ వెళ్లాడు. అయితే అనుకోని ప్రమాదం కారణంగా ఆయనకి గ్యాప్ వచ్చేసింది. ఆ తరువాత ఆయన చేసిన సినిమానే ‘విరూపాక్ష’. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, సుకుమార్ స్క్రీన్ ప్లే వేశాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.
మంచి ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 3 రోజుల్లో 44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా ఇంతపెద్ద హిట్ కావడానికి కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కార్తీక్ వర్మ ఎంచుకున్న కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సాధారణంగా ఒక కథను చెప్పడానికి ఎవరైనా కొంత లీడ్ తీసుకుంటారు. కొన్ని సినిమాల్లో ఈ లీడ్ కోసమే అరగంట సమయాన్ని కేటాయిస్తుంటారు కూడా. కానీ ఈ దర్శకుడు మొదటి షాట్ తోనే ఆడియన్స్ ను కథలోకి లాగేశాడు.
మొదటి నుంచి చివరి వరకూ కథ పట్టు సడలకుండా చూసుకున్నాడు. ఈ కథకి పాటలు అడ్డుపడే అవకాశం ఉంది. అందువలన వాటిని ఇరికించే ప్రయత్నం చేయలేదు. ప్రధానమైన పాత్రలు తక్కువే అయినా, వాటిని డిజైన్ చేసిన తీరు బాగుంటుంది. ఇక ఎక్కడ ఏ విషయాన్ని రివీల్ చేయాలనే విషయంలో సుకుమార్ వేసిన స్క్రీన్ ప్లే కథకి మరింత బలాన్నిచ్చింది. అడవి నేపథ్యంలో .. నైట్ ఎఫెక్ట్స్ లో చిత్రీకరణ, కెమెరా పనితనానికి అద్దం పడుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథలో నుంచి ఆడియన్స్ జారిపోకుండా చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయనే చెప్పాలి.