కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలన్నారు. రాయల తెలంగాణ అంశంపై ఈ రోజు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి…అక్కడ ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందన్నారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాయల తెలంగాణ కోరడం జరిగిందంటే అందుకు కారణం తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే అన్నారు.
తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ అభివృద్ధికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కలపండి లేకపోతే మా దగ్గరికి రండి అని కేసీఆర్ ని ఆహ్వానిస్తున్నారని, తెలంగాణ బంగారు తెలంగాణగా మారినట్టే సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమని గతంలోనే చెప్పారన్నారు. పరిపాలకుల చిత్తుశుద్ధి లోపంతో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని, పరిపాలకులను మార్చండి సువర్ణాంధ్రగా మార్చుకోండని పిలుపు ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. వెనుకబాటుకు కారణమైన పరిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు
చేయాలని, అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు నాయకులు ఆలోచించాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.