వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కావాలని మొదట కోరింది తామేనని మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్ నాడు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సిబిఐ విచారణ అడిగి, సిఎం అయిన తరువాత వద్దన్నారని గుర్తు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టిందన్నారు. పూర్తి స్థాయిలో నివేదిక ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కేసు డిస్మిస్ చేసిందన్నారు.
తనను సీబీఐ రెండు గంటల పాటు విచారించిందని, వారు అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పమని, తనను నిందితుడిగా పిలవలేదని స్పష్టంగా చెప్పారని ఆదినారాయణ వివరించారు, తాను తప్పు చేసి ఉంటే నన్ను ఎక్కడైనా ఉరి తీయవచ్చని.. ఈ కేసులో ఎన్నో ఆధారాలు బైటకు వస్తున్నా ఇంకా తనపేరు, చంద్రబాబు, బిటెక్ రవి, సునీత ఫొటోలు, పేర్లతో ప్రచారం చేయడం సరికాదన్నారు. ఒక్క శాతం తప్పు చేసినట్లు రుజువైనా తనను ఎన్కౌంటర్ చేయొచ్చని ఛాలెంజ్ విసిరారు. కోడికత్తి కేసులో కూడా తన పేరు పెట్టారని, తనను చంపొచ్చు కానీ ధర్మాన్ని చంపలేరని, తాను లేననే భావనతోనే బతకమని కుటుంబ సభ్యులకు ఇప్పటికే చెప్పానని ఆదినారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ పై ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.