తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గంలో జరుగుతోంది. నేడు మరో సెల్ఫీ ఛాలెంజ్ ను లోకేష్ రాష్ట్ర ప్రభుత్వానికి చేశారు. పులికనుమ బ్రాంచ్ కెనాల్ వద్ద సెల్ఫీ దిగారు. ఈ కెనాల్ తమ ప్రభుత్వ హయంలో పూర్తి చేశామని, ఇప్పుడు నీళ్ళతో కళకళలాడుతోందని అన్నారు.
“ ఇటువంటి మంచిపని ఒక్కటైనా చేశావా జగన్?! కరువుసీమలో సాగు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడిన కష్టం అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. మంత్రాలయం నియోజకవర్గం గవిగట్టు శివార్లలో పులికనుమ బ్రాంచి కెనాల్ ఎడారిలో ఒయాసిస్సులా నీళ్లతో కళకళలాడుతూ కన్పించింది. తుంగభద్ర ఎల్ఎల్ సి కెనాల్ కు నీరు నిలిపివేసినపుడు ప్రత్యామ్నాయ సాగునీటి వనరుగా కోసిగి మండలం పులికనుమ వద్ద రూ. 261కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని గత టిడిపి ప్రభుత్వ హయాంలో పూర్తిచేశారు. దీనిద్వారా 64 గ్రామాలకు తాగునీరు, 26వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాయలసీమ ప్రజల కళ్లలో ఆనందం చూసేలా ఒక్క పనైనా చేశావా జగన్మోహన్ రెడ్డీ?” అంటూ ప్రశ్నించారు.