ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధుల భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లా నార్పలలో జరిగే ఓ కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు జమ చేయనున్నారు. నేడు జమ చేస్తున్నదానితో కలిపి ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది.
ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి దీవెన కింద ఆర్ధిక సాయం అందిస్తోంది.
ప్రభుత్వం ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందిస్తోందని, జాబ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్‌లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు, విద్యార్ధులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశ పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ఇంటర్ పాస్ అయి పై చదువులకు దూరమైన విద్యార్ధుల సంఖ్య 2018–19లో 81,813 కాగా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతిదీవెన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి కేవలం 22,387 కి చేరిందని తెలియజేసింది. 2022–23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్ధుల జాతీయ సగటు 27 శాతం కాగా, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62 శాతం మాత్రమే. అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై జగన్ ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ. 58,555.07 కోట్లుగా పేర్కొంది.