చంద్రబాబు మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, ఆ అబద్ధాలు, మోసాలు నమ్మవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ఇంట్లో జగనన్న వల్ల మేలు జరిగిందా? లేదా? అని చూడాలని, మంచి జరిగిందని నమ్మితే మీరే తనకు సైనికులు కావాలని పిలుపు ఇచ్చారు. తాను ఎవ్వరినీ నమ్ముకోలేదని, ఆ దేవుడిని, ప్రజలైన మిమ్మల్ని నమ్ముకున్నానని స్పష్టం చేశారు. ‘నా ధైర్యం మీరే.. నా ఆత్మవిశ్వాసం మీరే…నా నమ్మకం మీరే’ అని వ్యాఖ్యానించారు. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల సందర్భంగా అనంతపురం జిల్లా నార్పలలో జరిగిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.
రిపబ్లిక్ టివికి వచ్చీ రాని ఇంగ్లీష్ లో చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ పంచతంత్రం కథను గుర్తుకు తెచ్చిందన్నారు. అబద్ధాలు ఆడేవారిని, వంచన చేస్తూ వెన్నుపోటు పొడిచే వారిని, మాయమాటలు చేప్పే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదనని పిలుపు ఇచ్చారు. సంవత్సరాలుగా నరమాంసం తింటున్న పులి ముసలిదైపోయినంత మాత్రాన తన గుణం మార్చుకోదని వ్యాఖ్యానించారు. ఈ కథ వింటే మోసపూరిత వాగ్ధానాలు, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే నైజం ఉన్న చంద్రబాబు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మరోసారి ప్రజలు మోసం చేసి అధికారం సంపాదించేందుకు సిద్దపడుతున్నారని పేర్కొన్నారు.
జాబు రావాలంటే బాబు రావాలన్న నినాదం మళ్ళీ బాబు అందుకున్నారని, గతంలో ఇదే మాట చెప్పి ఇంటింటికీ సంతకం పెట్టి మరీ లెటర్లు పంపించి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసే ఎత్తలేదన్నారు. రుణమాఫీ విషయంలోనూ అబద్ధాలు చెప్పి రైతులను నట్టేట ముంచారని సిఎం విమర్శించారు. రైతులకు, మహిళా సంఘాలకూ సున్నా వడ్డీ రుణాల పథకాన్ని కూడా నిలిపివేశారన్నారు. నిరుద్యోగ భ్రుతి విషయంలోనూ మాట తప్పి ఎన్నికలకు 2 నెలల ముందు కేవలం 3 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ఇదే పెద్ద మనిషి మళ్లీ టేప్ రికార్డర్ ఆన్‌చేశారని, అవే డైలాగులు చెప్తున్నారని, ప్రజల జ్ఞాపకశక్తితో ఆడుకుంటున్నారని సిఎం మండిపడ్డారు.