గుంటూరు, పల్నాడు జిల్లాల్లో చంద్రబాబు మూడు రోజుల పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ముసలాయన అంటే బాబుకు కోపం వస్తుందని, జగన్ కంటే నేను కుర్రోడినంటూ చెప్ప్పుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
గంగమ్మ కుటుంబానికి రెండులక్షల రూపాయలు బాబు అందించి ఆమెతో తనపై విమర్శలు చేయించారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. గత ఆగష్టు నెల 20వ తేదీన వైశ్య కులానికి చెందిన కందికోట్ల కొండలు అనే వ్యక్తి హోటల్ లో మురుగు కాల్వ శుభ్రం చేసేందుకు ఇద్దరు వడ్డెర కులస్తులు తురగా గంగమ్మ కుమారుడు అనిల్, గంగమ్మ అన్న పల్లపు రోశయ్య కుమారుడు అందులోకి దిగారని, వారికి ఆక్సిజన్ అందక కేకలు వేస్తే వారిని కాపాడబోయి కొండలు కూడా అందులోకి దిగారని, దురదృష్టవశాత్తూ ముగ్గురూ మరణించారని వివరించారు.
వడ్డెర కులస్తులు డబ్బుల కోసం కొండలు కుటుంబాన్ని అడిగితే… విషయం తన దృష్టికి వచ్చి ఖర్చుల కోసం చెరో రెండున్నర లక్షలు ఆ వైశ్య కుటుంబం నుంచి వడ్డెర కులస్తులకు ఇప్పించానని తెలిపారు. కొండలు కూడా చనిపోయాడు కాబట్టి, సిఎం రిలీఫ్ ఫండ్ వచ్చినప్పుడు ఈ డబ్బు తిరిగి ఆ వైశ్య కుటుంబానికి ఇవ్వాలని అప్పుడే షరతు పెట్టామని చెప్పారు. విషయం ఇదైతే… గంగమ్మ దగ్గర తాను రెండున్నర లక్షలు లంచం అడిగినట్లు అసత్య ఆరోపణ చేస్తున్నారని, దీనిలో వాస్తవాలు ఎప్పుడో చెప్పినా అవే విమర్శలు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని మండిపడ్డారు.
నామీద అసత్య ఆరోపణలు చేసినందుకు ఆమెకు జనసేన 4 లక్షలు, బాబు 2 లక్షల రూపాయలు ఇచ్చారని, దీనికి తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘నీకన్నా చిన్న పార్టీ జనసేన 4 లక్షలిస్తే నువ్వు మరీ 2 లక్షలే ఇవ్వడం ఏమిటి?’ అంటూ బాబును అంబటి ప్రశ్నించారు.