సిఎం జగన్ నాలుగేళ్ళుగా అప్పులు చేస్తూ కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికే పరిమితమయ్యారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ రైల్వే జోన్, మెట్రో రైల్ లాంటి అంశాలపై ఏమీ మాట్లాడలేదని గుర్తు చేశారు. నాలుగేళ్ళుగా ఏమీ చేయకుండా ఎన్నికలకు ముందు భోగాపురం ఎయిర్ పోర్ట్, అదానీ డేటా సెంటర్ లాంటి పథకాలకు హడావుడి శంఖుస్థాపన చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే అది వారి భ్రమేనని ఎద్దేవా చేశారు.
ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలని భోగాపురంలో దీని ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే చంద్రబాబు శంఖుస్థాపన చేశారని, నాలుగేళ్ళపాటు ఒక్క ఇటుక కూడా ఈ ప్రభుత్వం పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ శంఖుస్థాపాన చేయడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ నుంచి ఎన్నో అంతర్జాతీయ విమానాలు కూడా నడిచేవని, ఇప్పుడు ఒక్క సింగపూర్ ప్లేన్ మాత్రమే ఉందని వెల్లడించారు. అదానీ డేటా సెంటర్ నిర్మాణం కూడా గతంలోనే అన్ని మౌలిక వసతులూ కల్పించి మొదలు పెట్టామని చెప్పారు.
విశాఖ అభివృద్ధిని ఇప్పటి వరకూ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో చేస్తున్నామని చెప్పుకోవడం సరికాదన్నారు. దేశంలో ఐటి ఎగుమతుల్లో విశాఖ ఏడో స్థానంలో ఉండేదని, తమ హయంలో వచ్చిన అన్ని కంపెనీలూ తరలిపోయారని, వారి సమస్యపై ప్రభుత్వం ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని గంటా ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి కోర్టులంటే కూడా లెక్కలేదని, కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ ప్రభుత్వమే మొదటి స్థానంలో ఉందన్నారు.