Saturday, November 23, 2024
HomeTrending NewsSecretariat: బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభం

Secretariat: బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభం

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శిలఫలకాన్ని అవిష్కరించారు కేసీఆర్. ముందుగా హోమశిల వద్ద యాగ పూర్ణహుతిలో పాల్గొన్న సీఎం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్ కు ఎలక్ట్రిక్ వెహికిల్ లో చేరుకుని పలు ఫైల్ పై సంతకాలు చేసి పరిపాలను ప్రారంభించారు. 01 :58 నుంచి 02: 04 గంటల మధ్యలో మంత్రులు, అధికారులు తమ ఛాంబర్ లో అసీనులు కానున్నారు. తొలి సంతకాన్ని ఆరు ఫైళ్ల పై చేశారు కేసీఆర్.

‘డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు

• పరిపాలనా కేంద్రంగా, అత్యంత శోభాయమానంగా నిర్మించబడి ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించబడటం నాకు జీవితంలో దొరికిన పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను.
• చాలా పెద్ద పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడం మనందరి సాక్షిగా జరిగిన విషయం మీకందరికీ తెలిసిన విషయమే.
• సమైక్య పాలనలో చాలా విధ్వంసం జరిగింది. ప్రజలు చాలా బాధలకు గురైనారు.
• మీకు నీళ్లు ఎట్లా వస్తయ్.. కానే కావు..రానే రావు.. సాధ్యమే కాదు.. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని చెప్పబడిన విషయాలు మనకు తెలుసు.
• ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక్క హైదరాబాద్ తప్ప మిగిలిన తొమ్మిది జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలుగా పెట్టిన చరిత్ర మనం చూసాం.
• ఈరోజు తెలంగాణ సాధించిన ప్రగతి శిఖరాయమానంగా, శిఖరాగ్రంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలనా భవనం.. సచివాలయం..
• సెక్రటేరియట్ ఎంత అద్భుతంగా ఉందో.. తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా విలసిల్లుతున్నాయి.
• దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు. అందులో అనుమానం లేదు.
• ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఒక అద్భుతమైన తెలంగాణగా రూపొందుకున్నాం.
• సెక్రటేరియట్ వెలుగులకు ధీటైన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్ ల వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి అటెండర్ల వరకూ శుభాకాంక్షలు.
• డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అందించిన సందేశంతో, గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.
• సమతామూర్తి అంబేద్కర్ చూపిన బాటలోనే మన ప్రయాణం కొనసాగుతా ఉన్నది. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ సాధించుకున్నాం.
• తెలంగాణలోని అన్ని వర్గాల ముఖాల్లో చిరునవ్వు రావాలనే బాబాసాహెబ్ స్ఫూర్తిని అందుకున్నాం కాబట్టి వారి జయంతి సందర్భంగా ఆకాశమంత ఎత్తైన వారి విగ్రహాన్ని తెలంగాణయే కాదు, భారత జాతి కీర్తిని పెంచుకునేలా ప్రతిష్టించుకోవడం జరిగింది.
• బాబాసాహెబ్ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని సెక్రటేరియట్ కు అనునిత్యం వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులందరికీ అనునిత్యం స్ఫురణకు రావాలి, వారి సందేశం మనసులో పెట్టుకొని పనిచేయాలి. అంకితభావంతో పనిచేయాలనే ఉద్ధేశంతో ప్రధాన కార్యాలయమైన రాష్ట్ర సచివాలయానికి భారతదేశం గర్వించేలా ఆయన పేరు పెట్టుకున్నాం. భవిష్యత్తుకు కూడా బాటలు వేసుకుంటామని నేను మీకందరికీ హామీనిస్తున్నాం.
• జరిగిన పోరాటంలో, అనేక మలుపులలో తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరులందరికి కూడా నేను అంజలి ఘటిస్తా ఉన్నాను. నివాళులు సమర్పిస్తా ఉన్నాను.
• తెలంగాణ అవతరించిన కొత్తలో, అంతకు ముందు చాలా వాదవివాదాలు, వాదోపవాదాలు, చర్చలు మనం చూసాం.
• తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్మిర్మాణంలో మనం అంకితభావంతో పనిచేస్తున్న సందర్భంలో కొందరు అర్భకులు, తెలంగాణ యొక్క భావాన్ని, అర్ధాన్ని, పునర్మిర్మాణకాంక్షను జీర్ణించుకోలేనటువంటివారు కారుకూతలు కూసారు.
• తెలంగాణ పునర్మిర్మాణమంటే మొత్తం కూలగొట్టి మళ్లీ కడుతరా.. అంటూ కొందరు కురుచ వ్యక్తులు, దుర్మార్గులు, మరుగుజ్జు వ్యక్తులు చిల్లర వ్యాఖ్యలు చేశారు.
• చిల్లర వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా పనిచేశాం. ఈరోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది నా తెలంగాణ రాష్ట్రమని నేను గర్వంగా భావిస్తున్నాను.
• పునర్మిర్మాణమంటే నాడు సమైక్య పాలనలో చిక్కిశిల్యమైపోయి, శిథిలమైపోయి.. రంధ్రాలతో మొత్తం వచ్చిన నీటిని కూడా కోల్పోయినటువంటి అద్భుతమైనటువంటి కాకతీయ రాజుల స్ఫూర్తితో నిర్మణమైనటువంటి చెరువులన్నింటినీ పునరుద్ధరించి.. ఎండాకాలంలో కూడా మత్తెడులు దూకే చెరువులే పునర్మిర్మాణానికి భాష్యం.
• తెలంగాణలో అనేక ఉపనదులు, జీవనదులు ఉన్నాయి.
• ఉద్యమ సందర్భంలో అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య గోదావరి నది ఎప్పుడు దాటినా ఆ గోదావరి మాతకు నదిలో పైసలు వేసి, తల్లీ గోదావరి.. మా భూమ్మీదికి ఎప్పుడొస్తవ్.. మా పొలాలు ఎప్పుడు పండిస్తవని ఎంతో ఆర్తితో దండం పెట్టేవాణ్ణి.
• ఆనాటి సమైక్య రాష్ట్రంలో గోదావరి నదిలో రాగి నాణెం వేద్దామంటే నీళ్లు ఎక్కడున్నాయో వెతుక్కొని బ్రిడ్జిమీద నడిచి ఎక్కడో ఉన్న చిన్నపాటి గుంతలో రామగుండం దగ్గర పైసలు వేసేది.
• తెలంగాణ ఇంజనీర్లు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ మార్వెల్ ఇన్ ద వరల్డ్.. మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ఈరోజు శిఖరాయమానంగా ప్రపంచానికి తలమానీకంగా వెలిగింది.. ఇదీ పునర్మిర్మాణమంటే.
• గోదావరి, కృష్ణ నదుల్లోని వాగుల్లో నిర్మించినటువంటి చెక్ డ్యామ్ లు, మంజీరా, మానేరు. హల్ది, గూడవెల్లి ఉప నదుల మీద నిర్మించిన చెక్ డ్యామ్ లు ఏప్రిల్, మే నెలల్లో కూడా మత్తెడులు దుంకడమే కళ్లుండి చూడలేని కబోధులకు పునర్మిర్మాణానికి భాష్యం.
• నోళ్లు వెళ్లబెట్టి బీల్లుగా మారిపోయినటువంటి లక్షలాది, కోట్లాది ఎకరాల తెలంగాణ భూములు నేడు నిండు నీటి పారుదలకు నోచుకొని.. లక్షల ఎకరాల పంట చేలల్లో ఆ పొలాలు వెదజల్లుతున్న హరిత క్రాంతి ప్రభలే తెలంగాణ పునర్మిర్మాణం.
• ఈ రెండవ యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో ఉన్న వరి పైరు 94 లక్షల ఎకరాలు. అందులో 56 లక్షల ఎకరాలు ఒక్క తెలంగాణలోనే పంట పండుతున్నదని సగర్వంగా తెలియజేస్తున్నా. ఆ పొలాల్లో కనిపిస్తున్న హరిత క్రాంతే తెలంగాణ పునర్మిర్మాణం.
• తెలంగాణ పునర్మిర్మాణమంటే..ఒక కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్ట్.
• అర్థరాత్రి కరెంట్ పోయి.. ఎప్పుడొస్తదో తెలియక.. పారిశ్రామికవేత్తల ధర్నాలు… ప్రజల గగ్గోలు..జనరేటర్లు..ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో.. ఇవాళ ఇవన్నీ కూడా మాయమైపోయి అద్భుతమైనటువంటి కాంతులతో, వెలుగుజిలుగులతో, జాజ్జ్వలమాన్యంగా కరెంట్ వెలుగులతో విరాజిల్లుతున్న తెలంగాణయే.. పునర్మిర్మాణమంటే.
• కరెంట్ పెట్టడానికి పోయి తమ పొలాల దగ్గర పాములు, తేల్లు కుట్టి చనిపోయిన రైతులు నాడు.. నేడు దినం పూటనే ఆరు గంటలల్లో పారించుకొని దర్జాగా ఇంటికి వచ్చి, కంటి నిండా కునుకు తీస్తూ నిద్రబోతున్నటువంటి మా తెలంగాణ రైతన్న దర్ఫణమే తెలంగాణ పునర్మిర్మాణం.
• గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భతంగా అలరారుతున్నాయో.. ఎన్ని అవార్డులు గ్రామాలు సొంతం చేసుకుంటున్నాయో మీ అందరికీ తెలిసిందే.
• క్షీణించిపోయి..పత్తాలేకుండా పోయి,, ఆగమైపోయినటువంటి మన అడవులు..దేశంలోనే ఆల్ టైం రికార్డుగా హరిత శోభను వెదజల్లుతూ పునర్జీవనం అయితున్నయో.. కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోవడమంటే.. అదీ తెలంగాణ పునర్మిర్మాణమంటే అని ఆ అర్భకులకు, ఆ మరుగుజ్జులకు నేను తెలియజేస్తున్నా.
• వలసపోయిన పాలమూరు కూలీలు, ఒక్కరు కూడా వలసలో లేకుండా తిరిగి వచ్చి వాళ్ల స్వంత పొలాల మీద కుర్చీలేసుకుని కూర్చుంటే.. ఇతర రాష్ట్రాల కూలీలు మన తెలంగాణ పొలాల్లో పనిచేస్తుంటే చూస్తున్న దృశ్యాలే.. తెలంగాణ పునర్మిర్మాణమంటే.
• ఒకనాడు దాహంతో అల్లాడి.. ఫ్లోరైడ్ తో నడుం వంగి.. లక్షలాది మంది బిడ్డల జీవితాలు కోల్పోయిన, కుమిలిపోయిన తెలంగాణలో మిషన్ భగీరథ.. స్వయంగా భగీరథుడే దిగివచ్చి ప్రతి ఇంటిలో.. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏం వస్తయో.. అదిలాబాద్ గోండ్లు గూడేలలో కూడా అదే నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ.. తెలంగాణ పునర్మిర్మాణమంటే.
• పరిపాలనా సంస్కరణలతోని, స్లోగన్ ఓరియెంటెడ్ తో కాకుండా ఆచరణాత్మకంగా 33 జిల్లాలతో అలరారుతూ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్న మా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు నా సారథ్యంలో వెలుగుతున్న ప్రభలే..తెలంగాణ పునర్మిర్మాణమని తెలియజేస్తున్నా.
• 33 జిల్లాలలో 33 కలెక్టరేట్లు, 33 పోలీసు కార్యాలయాలు.. అక్కడినుంచి వెలుగులీనుతున్న వెలుగు ప్రభలే.. తెలంగాణ పునర్మిర్మాణమంటే.
• అనేక రంగాల్లో ముందుకుపోతున్న తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితోని రైతాంగాన్ని, సంక్షేమాన్నే గాకుండా పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం.
• మా ఇండస్ట్రియల్ విధానంలో, ఐటీ విధానంలో బెంగుళూరును కూడా దాటేసి ఎదిగిపోతున్న..తారాజువ్వలా దూసుకునపోతున్న తెలంగాణనే..తెలంగాణ పునర్మిర్మాణమంటే.
• పది సంవత్సరాలుగా ఒక చిన్న మత కల్లోలాలు లేకుండా.,. మహిళలకు భరోసానిస్తూ షీ టీం లు పనిచేస్తా ఉన్నయ్. అరాచకుల పీటం అణిచివేస్తూ తెలంగాణ పోలీసులు శాంతి భద్రతలను కాపాడుతూ తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా మారుతున్న తెలంగాణ పోలీసుల కృషే.. తెలంగాణ పునర్మిర్మాణం.
• మురికి కూపాలుగా ఉన్న పల్లెలు, పట్టణాలు, డివైడర్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో, డంప్ యార్డులతో, ప్రతి ఊరులో వైకుంఠధామాలతో అద్భుతమైనటువంటి తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఏ విధంగా తెలంగాణలో వెలుగులీనుతున్నయో.. అదీ పునర్మిర్మాణమంటే.
• మరుగుజ్జుల్లారా!.. జాగ్రత్త ఇప్పటికైనా మీ కుళ్లులు బంజేసుకోమని మనవి చేస్తున్నాను.
• అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలో ఎన్నెన్నో ఫ్లై ఒవర్ బ్రిడ్జిలు, ఎన్నో అండర్ పాస్ లు.. ఎన్నో రకాల సౌకర్యాలతో ముందుకు పోతున్నదో తెలంగాణ..ఇదీ పునర్మిర్మాణమంటే.
• నలువైపులా సూపర్ స్సెషాలిటీ హస్పిటల్స్.. తెలంగాణ వస్తున్నటివంటి అద్భుతమైనటువంటి వరంగల్ హెల్త్ సిటీ.. ఇవీ తెలంగాణ పునర్మిర్మాణానికి ప్రతీకలు.
• భూలోక వైకుంఠంగా.. రెండు చేతులతో యాదాద్రి శిఖరం నుంచి తెలంగాణ ప్రజలను దీవిస్తున్న యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం. ప్రపంచానికే ఆదర్శమైనటువంటి శోభాయమానమే.. తెలంగాణ పునర్మిర్మాణం.
• అష్టావక్రంగా, అడ్డదిడ్డంగా.. ఎండలో.. వానలో.. ఫైళ్లు పట్టుకొని పరిగెత్తుకొనే పరిస్థితుల నుంచి అద్భుతంగా శోభాయమానంగా, శిఖరాయమానంగా హైదరాబాద్ లో తలఎత్తుకొని నిలిచినటువంటి సెక్రటేరియటే… తెలంగాణ పునర్మిర్మాణానికి ప్రతీక.
• ఈ పరిపాలన సౌధం ఇంకా అద్భుతంగా పోతదని మనవి చేస్తున్నాను.
• ప్రపంచంలో అభివృద్ధిని రీ కన్ స్ట్రక్షన్ నూ కొలమానంగా తీసుకునేటటువంటి సూచికలు రెండే రెండు. ఒకటి పర్ క్యాపిటా ఇన్కం.. రెండోది పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్.
• అద్బుత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. మిగిలు రాష్ట్రంగా కొనసాగుతూ.. పెరుగుతూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రూ.3,00,017 లతో పర్ కాపిటా ఇన్కంలో నంబర్ వన్ లో ఉన్న తెలంగాణయే.. తెలంగాణ పునర్మిర్మాణమంటే.
• ఒకనాడు 1100 యూనిట్లే పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్ ఉన్న రాష్ట్రం.. నేడు 2,140 యూనిట్లతో భారతదేశంలోనే అగ్ర భాగాన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పర్ కాపిటా యుటిలైజేషన్ తెలంగాణ పునర్మిర్మాణం.
• నిరాదరణకు గురై..మూలిగి.. ముక్కిపోయినటువంటి వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎందరో బాధితులు అద్భుతంగా రూ.2016 ల ఆసరా పింఛన్లు అందుకుంటూ చిరునవ్వుతో గ్రామాలల్లో వెలిగిపోతున్న ముఖాలే తెలంగాణ పునర్మిర్మాణపు వెలుగు దివ్వెలని మనవి చేస్తున్నా.
• ఈ పునర్మిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్మించబడినటువంటి సచివాలయం చాలా అద్భుతంగా వచ్చంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నిర్మాణంలో పాలుపంచుకుని, చెమట చుక్కుల్ని వడిపిన వివిధ రాష్ట్రాల కూలీలు, కార్మికులకి తెలంగాణ ప్రజల తరపున చేయెత్తి నమస్కారాలు పెడుతున్నా. మీ చెమటను, శ్రమను వృధా పోనీయం. ఇక్కడినుంచి ప్రజలకు అభివృద్ధి ఫలాలు పంచుతాం.
• దేశంలోనే జరుగనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు ఆలవాలంగా, ఆదర్శప్రాయంగా రూపుదిద్దుకోవడంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ! జై భారత్!!

RELATED ARTICLES

Most Popular

న్యూస్