ఔటర్ రింగురోడ్డు టెండర్లలో జరిగిన అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం తనను సెక్రటేరియట్ కు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్, కేటీఆర్ తెగనమ్ముకున్నారని విమర్శించారు. నిన్నటి నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చిన కేసీఆర్… 24గంటలు తిరగకముందే మరిచారని విమర్శించారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదని, కానీ కేసీఆర్ పాలనలో ఒక ఎంపీగా ఉన్న తనను సెక్రటేరియట్ కు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
సెంట్రల్ జోన్ డీసీపీతో ఫోన్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి…. తాను దరఖాస్తు ఇచ్చాకనే తిరిగి వెళతానని భీష్మించుకు కూర్చున్నారు. దాదాపు అరగంట హైడ్రామా అనంతరం పోలీసులు మాసబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సూచించారు. దగ్గరుండి మాసబ్ ట్యాంక్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సెక్షన్ అధికారికి దరఖాస్తును సమర్పించారు రేవంత్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “ హెచ్ఎండీఏ కార్యాలయం ఇంకా షిఫ్ట్ కాలేదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇస్తే అక్నాలెడ్జిమెంట్ పై రబ్బరు స్టాంప్ కూడా వేయలేదని, సెక్రటేరియట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాధానం ఇచ్చారు. అరవింద్ కుమార్ ఇక్కడ లేడు, అక్కడ లేడు… మరి ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా? లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారు. ఇది వేల కోట్ల కుంభకోణం…. ఈ దోపీడీ వెనక కేటీఆర్, కేసీఆర్ ఉన్నారు. పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నారు. దీనిపై విచారణ సంస్థలకు పిర్యాదు చేస్తాం.. న్యాయస్థానాల తలుపు తడతాం..కెటీఆర్ ను జైల్లో పెట్టే వరకు పోరాడుతాం.“ అని విమర్శించారు.
పరిపాలన భవనంలోకి పార్లమెంటు సభ్యుడికి అనుమతి అవసరం లేదని.. అయినా కిలోమీటర్ దూరంలోనే తనను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు రేవంత్. కనీసం సెక్రటేరియట్ గేటు వద్దనైనా తన దరఖాస్తును తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ సచివాలయం గేటు వద్దకు కూడా తనను రానివ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను నిర్మించిందన్నారు. రూ.6696 కోట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందని, అందుకే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసి టోల్ వసూలుకు చర్యలు చేపట్టిందన్నారు. “ప్రతీ ఏటా ప్రభుత్వానికి 750కోట్ల టోల్ ఆదాయం ఉంది. అలాంటి ఆదాయం ఉన్న ఓఆర్ఆర్ ను రూ.7388 కోట్లకు ముంబై సంస్థ ఐఆర్ బీ కి బీఆరెస్ ప్రభుత్వం కట్టబెట్టింది. ఏడాదికి 750కోట్లు వస్తుంటే 246కోట్లకే ముంబై కంపెనీకి కట్టబెట్టింది. మూడు నెలల్లో దిగిపోయే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను అమ్మేసింది. కెటీఆర్ ను జైల్లో పెట్టే వరకు పోరాడుతాం.బీఆరెస్ ను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్ల పై విచారణ చేయిస్తాం. ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.