కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమైతే… పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరువలేనిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. పారిశుధ్య కార్మికుల్లో అత్యధిక శాతం దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలే. అత్యంత పేదరికంలో ఉన్న వీరికి రాష్ట్ర ప్రభుత్వం వేతనం వెయ్యి రూపాయలు పెంచడం ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. ఇది కంటి తుడుపు చర్య మాత్రమే అన్నారు. కేసీఆర్ పాలనలో పారిశుధ్య కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని, వారికి అనారోగ్యం తలెత్తితో పట్టించుకునే యంత్రాంగం లేదు. ఇలాంటి వారిపట్ల కేసీఆర్ ప్రభుత్వం శ్రద్ద చూపకపోగా… ఎన్నికలొస్తున్నాయని వెయ్యి రూపాయలు పెంచి ప్రేమను ఒలకపోస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
పారిశుధ్య కార్మికులెవరూ బాధపడొద్దు. 6 నెలలు ఓపిక పట్టండి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. అదనంగా మరో 2 వేల రూపాయల వేతనం పెంచుతాం. దసరా, ఉగాది పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా బోనస్ అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాను ద్రుష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కొత్తగా పారిశుధ్య కార్మికులను నియమిస్తామన్నారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు తెలుగు మీడియం విద్యార్థులకు ఎకనామిక్స్ ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లీష్ మీడియంలో అందజేయడం విడ్డూరమని బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. ఓపెన్ సొసైటీ ద్వారా పరీక్షలు నిర్వహించే విద్యార్థులంతా కూలీనాలీ చేసుకునే వారే. వారందరికీ తెలుగులో ఇవ్వాల్సిన ప్రశ్నాపత్రాలను ఇంగ్లీష్ లో ఇవ్వడమే కాకుండా చేసిన తప్పును సరిదిద్దుకోకుండా పరీక్షా సమయం ముగిసే వరకు వారిని కూర్చోబెట్టడం అన్యాయమన్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు కూడా నిర్వహించడం చేతగాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. టెన్త్, ఇంటర్ సహా ఇప్పటి వరకు ఏ ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ సర్కార్ రాష్ట్రంలో కొనసాగుతుండటం బాధాకరమని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.