అల్లరి నరేశ్ .. ఫస్టు సినిమా నుంచే తెరపై ఒక రేంజ్ లో అల్లరి చేయడం మొదలుపెట్టాడు. కామెడీ ప్రధానమైన సినిమాలు చేయాలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు ఆయనదే. అసలు ఆయనను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథలే ఎక్కువ. కథ నేపథ్యం ఏదైనా దానిపై తనదైన ముద్ర వేయడం ఆయన ప్రత్యేకత. చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేసిన ఈ జనరేషన్ హీరోగా అల్లరి నరేశ్ కి పేరు ఉంది. అలాంటి ఆయన కంటెంట్ విషయంలో ఈ మధ్య కాస్త రూట్ మార్చాడు.
కామెడీకి ఏ మాత్రం సంబంధం లేని ‘నాంది’ సినిమా చేసి ఆయన హిట్ కొట్టాడు. ఆ తరువాత కూడా సీరియస్ కంటెంట్ అయిన ‘ఉగ్రం’తో నిన్న థియేటర్లకు వచ్చాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఇంతకుముందు ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు .. ఫైట్లు చేశాడు. కానీ అవి ఫన్ తో నడిచేవి. ‘ఉగ్రం’ సినిమాలో కూడా ఆయన ఫైట్స్ చేస్తే అలాగే అనిపిస్తుందేమో అనుకున్నారు. కానీ ఆయన ఒక రేంజ్ లో చెలరేగిపోయాడు. కమెడియన్ నరేశ్ ను కళ్లముందు లేకుండా చేశాడు.
ఈ కథలో యాక్షన్ ఉంది .. ఎమోషన్ ఉంది .. ఈ పాత్రలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి ఉండవలసిన ఆవేశం ఉంది … ప్రమాదానికి ఎదురెళ్లే ధైర్యం ఉంది. ఈ పాత్రలో అల్లరి నరేశ్ విజృంభించాడు. బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ గా .. భర్తగా .. తండ్రిగా తన పాత్రకి న్యాయం చేశాడు. డైరెక్టర్ విజయ్ కనకమేడల నుంచి పెర్ఫెక్ట్ గా వచ్చిన కంటెంట్ ఇది. హింస కాస్త ఎక్కువగా కనిపించినా దానిని ఎమోషన్ కవర్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి అల్లరి నరేశ్ ఖాతాలోకి మరో హిట్ చేరిపోయిందనే చెప్పుకోవాలి.