ఈ ఏడాది నుంచి నేరుగా పాఠశాలలకే విద్యా కానుక కిట్లు పంపుతామని, కొత్త విద్యా సంవత్సరం తొలి రోజునే విద్యార్థులకు పంపిణీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్కూలు తెరిచిన వారం రోజుల్లోగా రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అన్ని వస్తువులతో కూడిన కిట్లు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి కచ్చితంగా యూనిఫాం, షూ ధరించే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను 10 రోజుల్లో మొదలు పెడతామని ఆయన హామీ ఇచ్చారు విజయవాడలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించిన బొత్స ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విద్యా శాఖలో అమలు చేస్తున్న మనబడి నాడు నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక తదితర పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులను బొత్స కోరారు