ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. సోమవారం సాయంత్రం లోగా ధాన్యం కొనుగోలు చేయకపోతే పోరుబాట చేపడతామని, రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఈ ధాన్యాన్ని ట్రాక్టర్లలో ఎక్కించి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుస్తామని, రైతులతో కలిసి జగన్ ఇంటిని ముట్టడిస్తామనిహెచ్చరించారు. అప్పుడైనా సిఎం తన ఇంటి నుంచి బైటకు వస్తాడేమో చూద్దామని రైతులతో వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాల్లో అకాల వర్షాలకు దెబ్బన్న పంట పొలాలను సందర్శిచి రైతులను పరామర్శిస్తున్న చంద్రబాబు నేడు నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. పలుచోట్ల రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ధాన్యానికి 1530 రూపాయల మద్దతు ధరను అందించాలని నూకలు, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు ఇప్పటి వరకు చెల్లించకకుండా మోసం చేసినందుకు రైతులకు క్షమాపణ చెప్పి ఆ నష్టపరిహారాన్ని కూడా వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇన్సూరెన్స్ ఉండి ఉంటే రైతులకు ఇబ్బంది వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు