బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్టు సినిమాతోనే మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. మొదటి సినిమా నుంచి ఇంతవరకూ తన సినిమాల భారీతనం ఎంతమాత్రం తగ్గకుండా చూసుకుంటూ వస్తున్నాడు. హీరోయిన్స్ విషయంలోను .. స్టార్ హీరోయిన్స్ తో ఐటమ్ సాంగ్స్ విషయంలోను ఆయన ఎంతమాత్రం రాజీ పడలేదు. దాంతో ఒక చిన్న హీరోగా ఆయనను ప్రేక్షకులు చూడలేదు. అయితే తన సినిమాల భారీతనానికి తగిన సక్సెస్ రేటును తను సాధించలేకపోయాడు.
తెలుగులో చివరిగా ఆయన ‘అల్లుడు అదుర్స్’ సినిమాను చేశాడు. సక్సెస్ ఫార్ములాగా చెప్పుకునే కథతో కూడా ఆయన హిట్ కొట్టలేకపోయాడు. ఆ తరువాతనే ఆయన ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ కి పరిచయం కావాలనే ఒక ఆలోచన చేశాడు. టాలీవుడ్ కి తనని పరిచయం చేసిన వినాయక్ దర్శకత్వంలోనే బాలీవుడ్ కి కూడా పరిచయం కావాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాడు. బడ్జెట్ విషయంలో ఎంతమాత్రం తగ్గకుండా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లింది.
ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ‘ఛత్రపతి’ పవర్ఫుల్ సబ్జెక్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో ప్రభాస్ మాస్ ఇమేజ్ ను మరింత పెంచిన సినిమా ఇది. అందువలన ఈ రీమేక్ పై కూడా అంచనాలు ఉన్నాయి. ఈ కథకి తగిన కటౌట్ ఉన్న హీరో బెల్లంకొండ అనడంలో ను సందేహం లేదు. కాకపోతే ‘ఛత్రపతి’ విడుదలైన ఇంతకాలం తరువాత రీమేక్ చేయాలనే ఆలోచన రావడం సాహసమే. ఈ సినిమా కోసం బెల్లంకొండ తెలుగులో గ్యాప్ తీసుకోవడం కూడా సాహసమే. మరి ఇంత కష్టపడిన ఆయనకి ఆశించిన ఫలితం దక్కుంతుందా లేదా అనేది చూడాలి.