సెట్విన్ ఆధ్వర్యంలో జంట నగరాలలో నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నడుపుతున్న మినీ బస్సులలో 15 సంవత్సరాలు పూర్తయిన బస్సులను దశలవారీగా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్. V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గోల్కొండ నుండి చార్మినార్ రూట్లలో ఒక బస్సు, సికింద్రాబాద్ మెహిదీపట్నం రూట్లలో మరో బస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సేట్విన్ అధ్వర్యంలో జంట నగరాల లలో 100 మినీ బస్సులను నడుపుతున్నామని, వాటిని దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం జరుగుతుందన్నారు. అలాగే, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సెట్విన్ బస్సు ఆపరేటర్లు ప్రయాణికులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని, ముందుకు సాగాలని, అలాగే బస్సులను పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కే. వేణుగోపాలరావు, మేనేజర్ ఎంఏ మోయిజ్, సెట్విన్ మినీ బస్సు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్ రెడ్డి, అలీ షేర్ ఖాన్, డి సుదర్శన్ రెడ్డి, హసన్ అలీ, అబ్దుల్లా భాయ్ తదితరులు పాల్గొన్నారు.