రాజకీయాల్లో హత్యలేమీ ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని, స్వయం కృతాపరాధాల వల్లనే నాయకులు విఫలం అవుతారంటారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం విన్న తరువాత ఇది స్పష్టంగా అర్ధమవుతుందని . తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషీయన్‌ను అని గుర్తొచ్చే పవన్ అలా మాట్లాడి ఉంటాడని అన్నారు.
“పవన్‌కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ ప్రారంభించింది రాజకీయాలు చేయడం కోసం కాదని, కేవలం చంద్రబాబును, టీడీపీని కాపాడటం కోసమేనని గతంలోనే చెప్పాం. ఈరోజు ఎన్నికల సమయం వచ్చేసరికి మరలా తన ప్రత్యర్థి జగన్‌గారు అని పవన్ చెబుతున్నాడు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి అధికారం లాక్కుని ప్రజలకు ఇస్తామంటున్నాడు. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి పవన్‌కళ్యాణ్? అంటే నీ దృష్టిలో చంద్రబాబును తిరిగి సీఎం సీటులో కూర్చొబెట్టడమా? దీనిపై పవన్‌కళ్యాణ్ నుంచి స్పష్టమైన సమాధానం రావాలి. మరలా చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడానికే తాను రాజకీయం నడుపుతానని పవన్‌కళ్యాణ్ మరోమారు చెబుతున్నాడా? అని నిలదీస్తున్నాను”
ఎన్నికలకు ముందే పవన్ సరెండర్ అయ్యారని ఆయనకు మద్దతు ఇస్తున్న అభిమానులతో పాటు కాపు సోదరులు, జన సైనికులు, ఆయన పక్షాన ఉండి పోరాడుతున్నామంటున్న వీరమహిళలు అర్ధం చేసుకోలేకపోయారని అన్నారు. “పవన్ ఎప్పటికీ సీఎం కాలేడు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే ఆయన పని చేస్తున్నాడని మేం చెబుతున్నాం. తాను సీఎం రేస్‌లో లేనని నిన్న చెప్పిన పవన్, ఇవాళ మాట మార్చారు. ఎన్నికలు అయ్యాక సీఎం పదవి గురించి ఆలోచిస్తానంటున్నాడు” అంటూ పవన్ ధోరణిపై అంబటి విస్మయం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి అయ్యాకనే మళ్లీ సభలో అడుగు పెడతానంటూ బాబు చేసిన శపథాన్ని నెరవేర్చేందుకు పవన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీని టీడీపీకి, చంద్రబాబుకు తాకట్టు పెట్టే దుస్థితికి పవన్ దిగజారిపోయాడనే విషయం అందరూ గమనించాలని కోరారు.
“మాట్లాడితే జగన్‌గారిని అధికారంలో నుంచి దించుతాం. ఆ పని చేసే వరకు పోరాడతాం.. ఆయన్ను దించడమే మా లక్ష్యమంటూ.. మా పొత్తులంటూ పవన్‌కళ్యాణ్ ఎందుకు రంకెలేస్తున్నాడు..? అసలు, మా జగన్‌గారిని అధికారంలో నుంచి ఎందుకు దించాలనుకుంటున్నావు..? స్వచ్ఛమైన, నీతిమంతమైన పరిపాలన నీకు నచ్చదా పవన్‌కళ్యాణ్ ..? అని నిలదీస్తున్నాను. నువ్వు భుజానెత్తుకుని మోస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్న జగన్ గారిని అధికారంలో నుంచి దించేయాల్నా..? అని అంబటి ప్రశ్నించారు.
రెండు మూడు దేశాలు, రెండు మూడు భాషలు వచ్చిన వాళ్లను పెళ్లిళ్లు చేసుకున్న వపన్‌కళ్యాణ్ కంటే సకలకళా కోవిదులు, సకలకళా వల్లభులు ఎవరైనా ఉంటారా..? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. “పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతామన్నారే.. ఇప్పుడు ఏ చెప్పుతో ఈ ప్యాకేజీ స్టార్‌ను కొట్టాలి..? మేం ఇప్పటిదాకా విమర్శిస్తుంటే, చాలా మందికి కోపం వచ్చింది. అందుకే, ఈరోజు మరోమారు చెబుతున్నదేమంటే, ఖచ్చితంగా పవన్‌కళ్యాణ్ బాబుకు అమ్ముడు బోయాడనడం ముమ్మాటికీ పచ్చి నిజం” అని అంబటి స్పష్టం చేశారు.