Friday, September 20, 2024
HomeTrending NewsUSA : అమెరికాకు ఆర్థిక ముప్పు

USA : అమెరికాకు ఆర్థిక ముప్పు

ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికా ఖజానా ఖాళీ అవుతుందా? అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థ దివాళా అంచున కొట్టుమిట్టాడుతోందా? అంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. అమెరికా ముందు పొంచివున్న ఈ ఆర్థిక ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఇప్పటికిప్పుడు డెబిట్ సీలింగ్‌ పెంచుకోవడం ( రుణ గరిష్టపరిమితి) ఒక్కటే మార్గమని ఆ దేశ ఆర్థిక మంత్రే స్వయంగా వెల్లడించారు. కొత్తగా అప్పులు చేసేందుకు వీలుగా డెబిట్‌ సీలింగ్‌ పెంపునకు చట్టసభలు ఆమోదం తెలిపితేనే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చని తెలిపారు. అమెరికా దివాళా తీస్తే.. ఆ ఒక్కో దేశమే కాదు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం కావాల్సి వస్తుంది.. కాబట్టి అమెరికా రుణ పరిమితి పెంపునకు ఆ దేశ చట్టసభలు ఆమోదం తెలపడం ఇప్పుడు చాలా అత్యవసరమని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, మిలటరీ సిబ్బంది జీతాలు, సామాజిక భద్రత, మెడికేర్‌, పన్నుల రీఫండ్‌లు, గతంలో తీసుకున్న అప్పులపై వడ్డీలు.. ఇలా ఈ ఖర్చులు అన్నింటినీ చెల్లించేందుకు ఒక్కోసారి ప్రభుత్వం దగ్గర ఆదాయం సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు అప్పులు తీసుకుని వాటిని చెల్లిస్తుంది. అయితే విచ్చలవిడిగా అప్పులు తీసుకుని.. ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలో పడేయకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకునే రుణాలపై కొంత పరిమితిని విధించారు. ఇలా పెట్టుకున్న రుణ గరిష్ట పరిమితినే డెబిట్‌ సీలింగ్‌ అని అంటారు. దీన్నే డెబిట్‌ లిమిట్‌ అని కూడా పిలుస్తుంటారు. అంటే ప్రభుత్వం ఎంత రుణాలు తీసుకున్నప్పటికీ ఈ పరిధిని దాటడానికి వీలుండదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మరిన్ని అప్పులు చేసి నిధులు సమకూర్చుకోవాలని అనుకుంటే అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాకు డెబిట్‌ సీలింగ్‌ 31.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ పరిమితిని అమెరికా జనవరిలోనే దాటేసింది. కానీ ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం కొంతవరకు నిధులను సమకూర్చుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు అది సాధ్యపడేలా లేదు. దీంతో డెబిట్‌ సీలింగ్‌ను పెంచడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది.

గతంలో కూడా ఇలా డెబిట్‌ సీలింగ్‌ పెంచాల్సిన అవసరాలు వచ్చాయి. దీనికి అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ ఆమోదం కూడా తెలిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ డెబిట్‌ సీలింగ్‌ పెంచడం ఇప్పుడు మాత్రం అంత ఈజీగా అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే అమెరికా కాంగ్రెస్‌ రుణ గరిష్ఠ పరిమితి పెంచేందుకు ఆమోదం తెలపాలంటే ముందుగా.. దానికి సంబంధించిన బిల్లును ప్రతినిధుల సభలో పెట్టాలి. ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన బిల్లును సెనేట్‌ ఆమోదిస్తుంది. అప్పుడే రుణ పరిమితి పెంపునకు చట్టసభ కాంగ్రెస్‌ ఆమోదం లభిస్తుంది. ప్రతిసారి ఈ ప్రక్రియ సులువుగానే జరిగిపోయేది. కానీ ఈ సారి మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎందుకంటే.. అధికారంలో ఉన్న డెమోక్రాట్లకు ప్రతినిధుల సభలో ఆధిపత్యం లేదు. అక్కడ ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉంది. వాళ్లేమో డెమోక్రాట్ల ప్రతిపాదనకు అంగీకారం తెలపడం లేదు. రుణ పరిమితి పెంచడం బదులు.. ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో డెబిట్‌ సీలింగ్‌ బిల్లు ప్రతినిధుల సభలోనే నిలిచిపోతుంది.

డెబిట్‌ సీలింగ్‌ పెంచాల్సి వచ్చిన ప్రతిసారి అమెరికా చట్టసభ కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. ఆమోదం తెలపకపోవడం అనే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కాబట్టి రుణ పరిమితి పెరగకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నిపుణులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఏదేమైనా జూన్‌ 1 నాటికి డెబిట్‌ సీలింగ్‌ పెంచకపోతే మాత్రం ఆర్థికంగా పెద్ద సంక్షోభం తప్పదని మాత్రం హెచ్చరిస్తున్నారు. డెబిట్‌ సీలింగ్‌ పెరగకపోతే ప్రభుత్వ ఉద్యోగుల, మిలటరీ సిబ్బంది వేతనాలు, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోతాయి. జాతీయ పార్కులు సహా ఇతర ఏజెన్సీలు కూడా మూతబడతాయి. అలాగే ఇప్పటిదాకా అమెరికా ప్రభుత్వం తీసుకున్న రుణాలు, వాటిపై వడ్డీని సకాలంలో చెల్లించడం కూడా కుదరదు. ఈ పరిణామాలు దివాళాకు దారితీస్తాయి. దీంతో ఏజెన్సీలు అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ను తగ్గించేస్తాయి. కొత్త రుణాలపై అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల సామాన్యులు తీసుకునే రుణాలపై కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇదే పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే స్టాక్‌ మార్కెట్లు పతనమవుతాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో కనీసం 4 శాతం క్షీణించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే 70 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

డెబిట్‌ సీలింగ్‌ పెంచేందుకు చట్టసభ ఆమోదం దక్కకపోతే అమెరికా ఆర్థిక శాఖ తనకున్న విశేష అధికారాలు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఈ అధికారాలతో జీతాలు, పింఛన్ల చెల్లింపులను ఆపేస్తారు. పెట్టుబడులను వాయిదా వేస్తారు. ఉన్న వనరులతో వడ్డీలు చెల్లించి దివాళా నుంచి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు. 2011, 2013లో డెబిట్‌ సీలింగ్‌ పెంచడంలో చట్టసభలో జాప్యం జరిగినప్పుడు ఇలాగే చేసి దివాళా నుంచి తప్పించుకుంది. అప్పుడు కాస్త ఆలస్యం జరిగినా డెబిట్‌ సీలింగ్‌ పెంపునకు ఆమోదం లభించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ డెబిట్‌ సీలింగ్‌ పెంచేందుకు ఆమోదం లభించకపోతే మాత్రం ఆర్థికంగా చాలా తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు సామాన్యులపై పన్నుల భారం కూడా మోపాల్సి వస్తుంది. అందుకే ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలంటే రిపబ్లికన్ల మనసు మార్చి చట్టసభలో ఎలాగైనా డెబిట్‌ సీలింగ్‌ పెంపునకు ఆమోదం దక్కేలా చేసుకోవాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్