తెలుగుదేశం- జనసేన పొత్తులపై మాట్లాడడానికి వైఎస్ జగన్ ఎవరని టిడిపి నేత బొండా ఉమా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా తన పార్టీ విధానమేమిటో చెప్పారని, 175 సీట్లు గెలుస్తామని, సింగల్ గానే వెళ్తామని చెప్పారని… వారి పార్టీ వారి ఇష్టమని… అంతేగానీ తమ పార్టీల గురించి ఆయనకు ఎందుకని అడిగారు. టిడిపి, జన సేన కలిస్తే మీకు సింగల్ డిజిట్ కే పరిమితమని, ఇదే విషయాన్ని జగన్ ఆత్మ ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పారని ఉమా ఆరోపించారు. జగన్ మోహంలో ఓడిపోతున్న కళ కనబడుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజ్యాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు, పవన్ లు ఒక వేళ పొత్తులతో వెళితే చెప్పే వెళ్తారని, కానీ సింగల్ గా వెళ్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని ఇప్పుడు ఎందుకు మాతో మాట్లాడుతున్నారని నిలదీశారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో బొండా ఉమా మీడియా సమావేశంలో మాట్లాడారు.
నారా లోకేష్ యువ గళం పాదయాత్రతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందని అప్పుడే చెప్పామని, నిన్నటికి వందరోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్రతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని ఉమా విమర్శించారు. ఊళ్లకు ఊళ్ళు లోకేష్ యాత్రకు కదిలి వచ్చి అక్కున చేర్చుకుంటున్నారని వెల్లడించారు. నిన్న వందరోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 175నియోజకవర్గాల్లో దాదాపు 10లక్షల మంది సంఘీభావ యాత్రల్లో పాల్గొన్నారని చెప్పారు. యువ గళం ప్రజా గళం యాత్రగా మారి, బడుగు బలహీన వర్గాల గళంగా మారుతోందన్నారు.