Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్IPL: ఉత్కంఠ పోరులో లక్నోదే పైచేయి

IPL: ఉత్కంఠ పోరులో లక్నోదే పైచేయి

ఐపీఎల్ లో నేడు జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. చివరి ఓవర్లో ముంబై విజయానికి 11 పరుగులు కావాల్సిన దశలో లక్నో బౌలర్ మోసిన్ ఖాన్ కేవలం నాలుగు పరుగులే ఇచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నవీన్ ఉల్ హక్ వేసిన 19 వ ఓవర్లో 22 పరుగులు రావడంతో ముంబై విజయం ఖాయమని అందరూ అనుకున్నా అది సాధ్యపడలేదు.

లక్నో అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 35 పరుగులకే లక్నో ఇద్దరు ఓపెనర్లతో పాటు మొత్తం మూడు వికెట్లు (దీపక్ హుడా-5; క్వింటన్ డికాక్-16; ప్రేరక్ మన్కడ్ – డకౌట్) కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోనిస్ లు క్రీజులో నిలదొక్కుకుని అడపా దడపా భారీ షాట్లతో  స్కోరు వేగం పెంచారు. వీరిద్దరూ కలిసి 89 పరుగులు జోడించారు. 42 బంతుల్లో 1 ఫోర్,  1 సిక్సర్ తో  49 పరుగులు చేసిన పాండ్యా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టోనిస్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో  4 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. పాండ్యా స్థానంలో వచ్చిన పూరన్ స్టోనిస్ కు స్ట్రైకింగ్ అప్పగిస్తూ 8 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.  దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బెహ్రెండార్ఫ్ 2; పియూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో ముంబై ఆరంభం బాగానే ఉంది, తొలి వికెట్ కు 90 పరుగులు జోడించింది. రోహిత్ 37 పరుగులు చేసి ఔట్ కాగా, ఇషాన్ కిషన్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 59 రన్స్ సాధించి వెనుదిరిగాడు. సూర్య కుమార్ యాదవ్ (7) విఫలం కాగా, నేహాల్ వధేరా 16 పరుగులు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విష్ణు వినోద్ (2) నిరాశ పరిచాడు. ఈ దశలో టిమ్ డేవిడ్- కామెరూన్ గ్రీన్ లు ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే  ప్రయత్నం చేసినా చివరి ఓవర్ లో పరుగులు చేయలేకపోయారు. ముంబై 20 ఓవర్ల కోటా పూర్తయ్యే సమయానికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.  లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్ చెరో 2; కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు.

మార్కస్ స్టోనిస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది. ఈ పరాజయంతో ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరగా, లక్నో మూడోస్థానంలో నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్