రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. చంద్రబాబు హయంలో ఏపీ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఉంటే, మూడేళ్ళలో ఈ ప్రభుత్వ అనాలోచిత, కక్ష సాధింపు నిర్ణయాలతో ఆ భారాన్ని సామాన్యుడు మోయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లను రద్దుచేసి.. ఆయా ప్రాజెక్టులనుంచి విండ్, సోలార్ పవర్ కొనుగోలు చేయకుండా… మార్కెట్ లో ఎక్కువ ధరకు కొన్నారని, ఈ భారం అంతా ప్రజలపై పడిందన్నారు. ఒక యూనిట్ కొనుగోలు చేస్తే రెండుసార్లు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. హిందుజా సంస్థ నుంచి కూడా విద్యుత్ కొనకపోతే వారు కోర్టుకు వెళ్ళారని, ఆ సంస్థకు కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
బొగ్గు కొనుగోళ్లలో అక్రమాలు, ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తక్కువ ధరకే ఇస్తామన్నా తీసుకోకపోవడం లాంటి నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ఛార్జీల వాతలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, విద్యుత్ రంగంలో దారుణమైన తప్పిదాలకు, అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కేశవ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉందన్నారు.