చంద్రబాబు కోసం ఎల్లో మీడియా ఎంతకైనా బరితెగిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రంలోకి రాకూడదంటూ బాబు హయంలో ఉత్తర్వులు ఇస్తే.. అప్పుడు దాన్ని సమర్ధించిన కొన్ని పత్రికలు సిబిఐకి వ్యతిరేకంగా వార్తలు రాశాయని గుర్తు చేశారు. బాబు ఎన్ని కేసుల్లో నైనా బెయిల్ తెచ్చుకోవచ్చని కానీ, తన తల్లికి అనారోగ్యం కారణంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఒక వారం రోజులు సిబిఐని గడువు అడిగితే ఇదేదో పెద్ద నేరంగా వార్తలు రాయడం దారుణమని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమంటే ఎందుకింత కడుపు మంట అని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు.
గతంలో చంద్రబాబు మచిలీపట్నం వస్తే కనీసం వెయ్యిమంది కూడా రాలేదని, అప్పుడు జనం రాలేదని రాయని పత్రికలు… బందరు పోర్టు పనుల ప్రారంభం సందర్భంగా నిన్న జరిగిన బహిరంగ సభలో జనం సభ జరుగుతుంటే మధ్యలోనే వెళ్ళిపోయారంటూ అసత్య వార్తలు రాశారని, ఏం చెప్పినా, ఏం రాసినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఖాళీ కుర్చీలకు గంటన్నరపాటు స్పీచ్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అని, కానీ నిన్నటి సభలో ఆద్యంతం ప్రజలు ఆసక్తిగా సభలో కూర్చుని సిఎం ప్రసంగాన్ని విన్నారని నాని వివరించారు. బాబును మేలు చేకూర్చేందుకే ఎల్లో మీడియా తాపత్రయం అంటూ నాని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదలైతే నిధుల వరద అంటూ వార్తలు రాస్తున్నారని, గత ఐదేళ్ళలో చంద్రబాబు అసమర్ధత, చేతగానితనం వల్ల రాకపోతే.. జగన్ ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను అడిగి వాటిని సాధించుకు వచ్చారని, ఆయన ఢిల్లీ వెళ్ళింది ఈ డబ్బుల కోసమే అంటూ నాని చురకలు అంటించారు. ఈ నిధులు విడుదల కాగానే కొంతమంది కళ్ళలో రక్తం కారుతోందని, రక్త కన్నీరు నాగభూషణం అవుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిసారీ జగన్ కేసులు అంటూ మాట్లాడారని, అసలు ఈ కేసుల్లో ఇప్పటికే కొన్ని కొట్టేశారని గుర్తు చేశారు.