ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతిసారి తన ద్వంద్వ వైఖరి చాటుకుంటున్నది. అందుకు ఉదాహరణే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం. 10 డిసెంబరు 2020లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన మోదీ.. ఈ నెల 28న వీర్ సావర్కర్ 140వ జయంతిని పురస్కరించుకుని పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి అందులో తొలి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అధికారం ప్రధానికి ఎలా ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రతిపక్షాలు కూడా ఇదే విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. రాజ్యాంగంలోని 79వ అధికరణంలో పార్లమెంటుకు పేర్కొన్న నిర్వచనం ప్రకారం.. కేంద్రానికి ఓ పార్లమెంటు ఉండాలి. అందులో రాష్ట్రపతి, రెండు సభలు ఉండాలి. వీటిని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అంటారు. కార్యనిర్వాహక అధికారం మాత్రమే ప్రధానికి ఉంటుంది. శాసనవ్యవస్థపై పార్లమెంటుకు, న్యాయవ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారాలుంటాయి. మొత్తంగా ఈ మూడు వ్యవస్థలపై రాష్ట్రపతికి సర్వాధికారాలు ఉంటాయి. రాజ్యాంగం చెబుతున్నది ఇదే. కాబట్టి ఏ రకంగా చూసినా పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, ఇమేజీ పెంచుకోవాలని నిరంతరం తపించే మోదీకి ఇవేవీ పట్టడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. తగుదునమ్మా అంటూ పార్లమెంటు భవన ప్రారంభానికి సిద్ధం అవుతుండడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప మరోటి కాదని విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.