ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బెంగళూర్‌ను ముంచెత్తాయి. కుండపోతతో నగర వీధులు జలమయం కావడం బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య అకాల వర్షాలు బెంగళూర్‌ను ముంచెత్తడంతో ఈ కాలంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ విభాగం హెచ్చరించడంతో నగరంలో తాత్కాలిక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలని బృహత్ బెంగళూర్ మహానగర పాలిక (బీబీఎంపీ) యాక్షన్ ప్లాన్ చేపట్టింది. మరోవైపు వరద నీరు రహదారులపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల నేపధ్యంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా మరణించిన వారందరికీ పరిహారం చెల్లిస్తామని సీఎం తెలిపారు. ఇక వరద బాధితులకు తక్షణ సాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.