అమరావతి రాజధానిని ఓ పధ్ధతి ప్రకారం నాశనం చేస్తోన్న సిఎం జగన్ ఇప్పుడు ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ అంటూ మరో నాటకానికి తెరదీశారని టిడిపి ప్రధాన కార్యదర్శి బొండా ఉమా ఆరోపించారు. సీఆర్డీఏ చట్టానికి రూపకల్పన చేసే సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా మేధావులు, ఇక్కడి రైతులతో సంప్రదింపులు చేసి తొమ్మిది నగరాలకు రూపకల్పన చేశారని… ఎక్కడ ఏయే రంగాలు ఉండాలనేదానిపై ఓ నిర్దిష్ట ప్రణాళిక రూపొందించారని వివరించారు. దీన్ని పక్కనపెట్టి కొత్తగా R5 జోన్ ఏర్పాటు చేసి గతంలో ఎలక్ట్రానిక్ సిటీ ప్రతిపాదించిన చోట ఇళ్ళ పట్టాలు ఇస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుళ్ళూరు దీక్షా శిబిరంలో నిన్న జరిగిన ఘటనను, రైతులపై డీఎస్పీ పోతురాజు చేసిన వ్యాఖ్యలను ఉమా తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై పోలీసుల తీరు దుర్మార్గమని మండిపడ్డారు. అన్ని వర్గాలవారూ నివాసం ఉండేలా పేదలకు ఇళ్ళ నిర్మాణం కోసం 5 శాతం భూమిని నాటి బాబు ప్రభుత్వం రిజర్వు చేసిందని, కానీ అక్కడ స్థలాలు ఇవ్వకుండా మొత్తం 13 గ్రామాల్లో పట్టాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు.
ఈ రాష్ట్రం కోసం, రాజదానికోసం భూములు ఇచ్చిన వారి త్యాగాలను, మనోభావాలను కించపరిచేలా సిఎం జగన్ వ్యవహరిస్తున్నారని… ఇప్పుడు ఇస్తున్న సెంటు భూమి పట్టా కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాలూ కల్పించకుండా పట్టాలు ఇవ్వడం అంటే సిఎం జగన్ కు పేదల పట్ల ఉన్న చిత్తశుద్ది ఏమిటనేది ఆలోచించాలని అన్నారు. రేపు ఇస్తున్న పట్టాలు చెల్లవని సర్వోన్నత న్యాయస్థానం కూడా చెప్పిన విషయాన్ని బొండా గుర్తు చేశారు.