మాజీ మంత్రి దేవినేని ఉమాను వెంటనే విడుదల చేయాలని టిడిపి సీనియర్ నేత, శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ను పరిశీలించడానికి వెళ్ళిన దేవినేనిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని, వారిని అదుపులోకి తీసుకోకుండా బాదితుడైన ఉమను అరెస్టు చేయడం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ పాలన అవినీతి, అరాచకంగా సాగుతోందని యనమల దుయ్యబట్టారు.
వైసీపీ నేతల దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, అతని బావ మరిది కనుసన్నల్లోనే మైనింగ్ జరుగుతోందని, వేల కోట్ల రూపాయల గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని యనమల ఆరోపించారు. దాడులకు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని, వైసీపీ నేతలు సాగిస్తున్న సహజ వనరుల దోపిడీపై తమ పోరాటం కొనసాగుతుందని యనమల స్పష్టంచేశారు.
మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ టిడిపి నేతలతో కలిసి పరిశీలించడానికి దేవినేని ఉమా వెళ్ళారు. అయితే ఉమాను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలో టిడిపి-వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడకు చేరుకున్న సంఘటనా స్థలం నుంచి దేవినేనిని జి. కొండూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారూ. అయితే దేవినేని ఉమా, టిడిపి నేతలు తమపై దాడికి పాల్పడ్డారని వైసీపీ కార్యకర్తలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు చేసిన ఫిర్యాదు మేరకు జి. కొండూరు పోలీస్ స్టేషన్ నుంచి దేవినేనిని అరెస్టు చేసి తొలుత పెదపారుపూడి స్టేషన్ కు తరలించారు, తర్వాత అక్కడినుంచి నందివాడ పోలీస్ స్టేషన్ కు మార్చారు. కాసేపట్లో ఆయన్ను నూజివీడు కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.
ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. దేవినేనిపై దాడి చేసిన వారిని వదిలేసి ఆయనపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యకం చేశారు. ఈ ఘటనపై పార్టీ సీనియర్ నేతలతో కాసేపట్లో చంద్రబాబు సమావేశం కానున్నారు.