అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోవడంతోపాటు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పి కొట్టాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం కొడకండ్ల1, 3 ఎంపీటీల పరిధిలో కొడకండ్లలోని ఓ ఫంక్షన్ హాలులో, కొడకండ్ల మండలం రేగుల, ఏడునూతుల గ్రామాలకు కలిపి, ఏడునూతుల సమీపంలోని ఓ మామిడి తోటలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని ఆంక్షలు విధిస్తే, తన బొండిగలో పాణం ఉన్నంత వరకు అలా జరగనీయనని పట్టుబట్టిన మహనీయుడు కెసిఆర్ అన్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత 24 గంటల విద్యుత్ వెనుక సీఎం కెసిఆర్ చొరవతో ప్రతి ఏటా రైతుల తరపున 10వేల 500 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థకు కడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఎదురు పెట్టుబడిగా రైతు బంధును ఇస్తున్నారని చెప్పారు. రైతు బీమా పథకం ప్రీమియం కట్టడమేగాక, ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే అతని కుటుంబానికి 10 రోజుల్లోపు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నది కూడా ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. చివరకు రైతుల పంటలను కూడా కొనుగోలు చేస్తున్న విషయాన్ని మంత్రి వివరించారు. ఏడాదికి 30వేల కోట్ల నష్టం జరుగుతున్నప్పటికీ రైతులకు మద్దతు ధర పెట్టి వారి పండించిన ధాన్యాన్ని, మక్కలను కొనుగోలు చేస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్నది. సహాయ నిరాకరణ చేస్తున్నది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అభినందిస్తూనే, నయా పైసా ఇవ్వడం లేదని మంత్రి విమర్శంచారు. కేంద్రంలో పొగిడే బిజెపి, రాష్ట్రంలో మాత్రం ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నదని ఆరోపించారు. పంటల నష్ట పరిహారంగా సీఎం కెసిఆర్ ఎకరాకు రూ.10వేలు ప్రకటించారని, కానీ, దేశంలో ఎక్కడా రూ.3వేలకు మించి ఇవ్వడంలేదని మంత్రి తెలిపారు. పెన్షన్లు కూడా మన రాష్ట్రంలోనే అధికంగా ఇస్తున్నామని చెప్పారు.
అర్హులైన వాళ్ళందరికీ త్వరలోనే పెన్షన్లు
57 ఏండ్లు నిండిన, అర్హులైన అందరికీ త్వరలోనే పెన్షన్లు అందచేస్తామని మంత్రి తెలిపారు. ఇటీవలే ఈ పథకం కింద అనేక మందికి పెన్షన్లు ఇస్తున్నామని, అయితే ఇందులో అనేకానేక కారణాల వల్ల కొందరి పేర్లు రాలేదని అంటున్నారని, అలాంటి వాళ్ళల్లోనూ అర్హులైన వారందరికీ త్వరలోనే పెన్షన్లు అందేలా చేస్తామని మంత్రి వివరించారు.
మహిళలు బాగుపడితేనే దేశం బాగుపడతది. అందుకే మహిళలకు ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో ఉచితంగా కుట్టు శిక్షణ, మిషన్ల పంపిణీ, ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అలాగే నిరుద్యోగ యువకుల కోసం కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
తాను మంత్రి అయ్యాక పాలకుర్తి నియోజకవర్గంలో ఒక్కో మండలానికి రూ.100కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వివరించారు. మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, రోడ్ల వెడల్పు, అన్ని గ్రామాలకు లింకు రోడ్లు, ఉన్న రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడం, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు ఇలా అనేక మౌలిక వసతులను గ్రామాలకు కల్పించినట్లు మంత్రి వివరించారు. కొత్త గ్రామ పంచాయతీలకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వివరించారు.
ప్రతిపక్ష పార్టీలు సీఎం కెసిఆర్ మీద, తెలంగాణ మీద బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఎర్రబెల్ల దయాకర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపిలు తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో చేయలేని, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి, మన రాష్ట్రంలో గొప్పలు చెబుతున్నాయని, ఎక్కడా ఇవ్వలేని నిరుద్యోగ భృతిని ఇక్కడ ఇస్తామంటున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎరుగుతుందా? అని ప్రశ్నించారు. పనికి మాలిన బిజెపి, కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొడుతూ, ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం మనందరిపైనా ఉందన్నారు. ప్రజలు కూడా ఆయా పనులను విశ్లేషించుకోవాలని, మంచి చెడులను ఎంచి, సిఎం కెసిఆర్ కు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.