సత్యదేవ్ హీరోగా 2011లోనే తెలుగు తెరపైకి వచ్చాడు. అప్పటి నుంచి చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళ్లిన ఆయన, 2015లో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి వీలైతే హీరోగా .. కుదిరితే ముఖ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. సత్యదేవ్ మంచి నటుడు అంటూ మెగాస్టార్ దగ్గర నుంచి అందరూ కితాబును ఇచ్చినవారే. అయితే ఆయన నటనకి తగిన సక్సెస్ లు మాత్రం వెంటపడటం లేదు. దాంతో ఆయన హిట్ కోసం ఎదురుచూస్తూనే ముందుకు వెళుతున్నాడు.
సత్యదేవ్ ఒక ప్రత్యేకమైన నటుడు .. ప్రత్యేకమైన పాత్రలలోనే ఆయన ఎక్కువగా మెప్పించగలడనే టాక్ ఉంది. ఆయనకి డాన్సులు గట్రా సెట్ కావనే వారు కూడా లేకపోలేదు. అయినా హీరోగా తన కెరియర్ ను ముందుకు తీసుకుని వెళ్లడానికి ఆయన ఉత్సాహాన్ని చూపిస్తూనే ఉన్నాడు. హీరోగా చేసిన ‘గాడ్సే’ .. ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలు సరిగ్గా ఆడకపోయినా, హీరోగా ఆయన మరో సినిమాతో పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా పేరే ‘ఫుల్ బాటిల్’.
గతంలో సత్యదేవ్ హీరోగా ‘తిమ్మరుసు’ సినిమా చేసిన శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకి దర్శకుడు. శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యాన్ఫర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో సంజన ఆనంద్ కథానాయికగ్గా నటిస్తోంది. ఇటీవల కాలంలో మందు సీన్స్ ఎక్కువైపోయి ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఏకంగా ఈ సినిమాకి ‘ఫుల్ బాటిల్’ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ తో ఫ్యామిలీకి ఆడియన్స్ ను మినహా ఇంచినట్టు అవుతుందా? యూత్ కోసమే తీశారని అనుకోవాలా? అనే డౌట్ రాకమానదు. మందు కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా, ఏం మహిమ చేస్తుందో చూడాలి.