రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పు అభివృద్ధికి, సంపద సృష్టికి ఉపయోగపడాలని కానీ, జగన్ ప్రభుత్వం చేస్తోన్న అప్పు అవినీతికి మాత్రమే ఉపయోగపడుతోందని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. సంపద సృష్టించడానికి బదులు సంపద ఆవిరి చేయడానికి వినియోగిస్తున్నారని చెప్పారు. ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఆయా పథకాలు రాష్ట్రానికి ఉపయోగపడకుండా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కనకమేడల మీడియాతో మాట్లాడారు.
నీతి ఆయోగ్ సమావేశం వేదికగా సిఎం జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని కనకమేడల విమర్శించారు. ఆరోగ్య కరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక వసతులను బలోపేతం చేయాలని జగన్ చెప్పారని, కానీ వాస్తవానికి రాష్ట్రంలో చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలను పనిచేయనీయకుండా రాష్ట్రం నుంచి వెళ్ళగొడుతున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత కక్షలే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారని… ఆయనకు నచ్చని పరిశ్రమలను, తన ఆదేశాలకు తలవంచని ప్రతి పారిశ్రామికవేత్తనూ తరిమేస్తున్నారని విమర్శించారు. అమర్ రాజా బ్యాటరీ దీనికి ప్రధాన ఉదాహరణ అని గుర్తు చేశారు.
చంద్రబాబు హయంలో విశాఖ సదస్సు ద్వారా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే, ఆయా పరిశ్రమలకు నాటి ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసి, అనుమతులు కూడా క్యాన్సిల్ చేశారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా మన భారత కొత్త పార్లమెంట్ భవనం ఉండబోతోందని , చంద్రబాబు 2047విజన్ కు ఇది ఓ వేదిక కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్పారు. ఎన్టీఆర్100వ పుట్టిన రోజు నాదే ఈ భవనం ప్రారంభంకావడం యాదృచ్ఛికమే అయినా గర్వకారణంగా భావిస్తున్నామన్నారు.