Mini Review: “అంతవరకూ సాఫీగా సాగిపోతున్న జీవితం ఆత్మీయుల మరణంతో అల్లకల్లోల మవుతుంది. హఠాత్తుగా సంభవించే ఇటువంటి పరిణామాలు మనసుకు ఎంతో కష్టం కలిగిస్తాయి. నమ్మాలని అనిపించని వాస్తవాన్ని జీర్ణం చేసుకుని మాములుగా ఉండడానికి సమయం పడుతుంది. మెల్లగా ప్రపంచంతో కలుస్తాం. నవ్వుతూ మాట్లాడతాం. ముందులాగే ఆనందంగా జీవించే ప్రయత్నం చేస్తాం. అలాగని దూరమైన వారిని మరచిపోయామని కాదు. ఆ బాధ మనసులో అలాగే ఉంటుంది. మనకై మనం వదిలేస్తే తప్ప ఆ బాధ పోదు. దాన్నో చక్కటి జ్ఞాపకంగా మార్చుకుని ముందుకు సాగడమా లేక బాధలో కురుకుపోవడమా అన్నది మన చేతుల్లో ఉంటుంది” పచువుమ్ అద్భుత విలక్కుమ్ ( పచ్చు మేజిక్ లాంప్) చిత్రంలో కథానాయిక హీరో ఫహద్ ఫాజిల్ తో అన్న మాటలు సూటిగా మన హృదయాల్ని తాకుతాయి. (ఆత్మీయుల మరణాలతో ఆరాటపడేవారంతా ఇక్కడ ఆగిపోతారు …ఆలోచిస్తారు).
ఇదొక్కటే కాదు, సినిమా అంతా చక్కటి హాస్యం, కదిలించే సంభాషణలు కట్టి పడేస్తాయి. మరీ సన్నగా ఉన్న ఫహద్ ని చూస్తే అభిమానులకు కలిగే దిగులు సినిమా అయ్యేసరికి నెమ్మదిస్తుంది. తనవద్ద పనిచేసే అమ్మాయికోసం అంతస్తుల హద్దులు దాటిన పెద్దావిడ ఔదార్యం కంట నీరు పెట్టిస్తుంది. చదువుకోవాలని ఉన్నా పేదరికం గడప దాటనివ్వని బాలిక పాత్ర సానుభూతి కలిగిస్తుంది.
మొదట అందరిలాగే సామాన్య మధ్యతరగతి యువకుడిగా స్వార్థంగా ఉన్న హీరో పరిస్థితిని బట్టి పెరిగిన పెద్ద హనుమంతుడిలా సమస్యని తనదైన తీరులో పరిష్కరించడం బాగుంది. వంక పెట్టలేని నటనతో ప్రతి ఒక్కరూ ఆకట్టుకుంటారు. ప్రేమదేశం, చంద్ర ముఖి సినిమాల వినీత్ ఇందులో గంభీరంగా ఉన్నాడు. చాన్నాళ్లకు తెరపైకి వచ్చిన ఫహద్ ఫాజిల్ అభిమానులను బాగా అలరిస్తాడు. ఇతరులకు సహాయం చేయబోయిన ప్రతిసారీ మరో సమస్యలో ఇరుక్కుంటూ ఉంటాడు. బక్కపలుచటి ఫహద్ పక్కన బొద్దుగా ఉన్న హీరోయిన్ అంజనా జయప్రకాష్ పాత్రలో ఒదిగిపోయింది. దర్శకుడు అఖిల్ సత్యన్ కి మొదటి సినిమా అంటే నమ్మలేం. అంత చక్కగా తీశాడు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.
-కె. శోభ