కొన్ని సంఘటనలు కొందరి పేరిట చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. లోకంలో మంచికి చెడుకు ఆ సందర్భం గుర్తొచ్చిన ప్రతిసారీ ఆ వ్యక్తులు కూడా గుర్తొస్తారు. అలాంటి వ్యక్తి ఎస్ ఆర్ బొమ్మాయ్. 1988లో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈయన కొడుకే బసవరాజ్ బొమ్మాయ్ ఈరోజు కర్ణాటక ఇరవయ్యో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఏమాత్రం అకెడెమిక్ ఇంటరెస్ట్ ఉన్నవారికయినా ఎస్ ఆర్ బొమ్మాయ్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసు పరిచయమే. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులందరూ తప్పక చదివే కేసు. న్యాయ, రాజ్యాంగ విషయాల మీద మౌలిక అవగాహన కోసమయినా తెలుసుకోవాల్సిన కేసు.
నేపథ్యం
———
ఎస్ ఆర్ బొమ్మాయ్ ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 356 ఆర్టికల్ ను ఉపయోగించి ప్రభుత్వం గొంతు కోసింది. సభలో బలనిరూపణకు అవకాశమివ్వాలని బొమ్మాయ్ కోరిన కోరికను గవర్నర్ పట్టించుకోలేదు. న్యాయశాస్త్రం చదివిన బొమ్మాయ్ మొదట కర్ణాటక హై కోర్టుకు, ఆపై సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఒక మైలు రాయి అనదగ్గ తీర్పు వచ్చింది. బొమ్మాయ్ ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నా ఆయన పేరిట తీర్పు మాత్రం భారత న్యాయ చరిత్రలో లిఖితమయ్యింది.
ఫలితం
——-
బొమ్మాయ్ విషయంలో కేంద్రానిది అక్షరాలా తప్పేనని సుప్రీం కోర్టు తీర్మానించింది. సభలో బల నిరూపణకు అవకాశం ఇవ్వకపోవడం మహాపరాధమని తేల్చి చెప్పింది. చేతిలో 356 అంగుళాల కత్తి ఉంది కదా అని రాష్ట్రాల గొంతులు కోస్తూ ఉంటారా? అని కన్నెర్ర చేసింది.
అప్పటినుండి కేంద్రం 356 ఆర్టికల్ ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాల ఉసురు తీయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాయి.
స్ఫూర్తి
——–
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన ప్రభుత్వాలు ముందు ఆయా చట్ట సభలకు లోబడి ఉంటాయి. పార్టీల బలాబలాలు, మెజారిటీలు నిరూపణ కావాల్సింది సభల్లో. ప్రభుత్వాలు సభల విశ్వాస పరీక్షల్లో గెలవాలి. బయట కాదు.
కేంద్రం, గవర్నర్ చేతిలో ఎస్ ఆర్ బొమ్మాయ్ తాత్కాలికంగా ఓడినా- చట్టసభల గౌరవ మర్యాదలు , స్వయం ప్రతిపత్తికి సంబంధించిన కేసులో మాత్రం ఆయన శాశ్వతంగా గెలిచాడు. ఆయన కొడుకే ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్.