చంద్రబాబు విడుదల చేసిన మొదటి దశ మేనిఫెస్టో చూసి, తమ హామీలు ప్రజల్లోకి వెళుతున్న తీరు చూసి వైసీపీ నేతలకు భయం పట్టుకుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మొన్న విడుదల చేసింది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుందని చెప్పారు. తమ మేనిఫెస్టోను కొందరు చింపేశారని, కానీ దాన్ని ప్రజల మనసుల నుంచి చింపివేయలేరని స్పష్టం చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో గంటా మీడియాతో మాట్లాడారు. ఆరు అంశాలతో ఇచ్చిన తొలి విడత హామీలను ‘సూపర్ సిక్సర్’ అని అంటున్నారని చెప్పారు.
జగన్ నాలుగేళ్ల పాలన చరిత్రలో ఎరగని అద్భుత పాలన అంటూ వైసీపీ ప్రకటనలు ఇచ్చుకుందని… కానీ వాస్తవంగా ఆ ప్రకటనకు భిన్నంగా రాష్టంలో విధ్వంసక, అస్తవ్యస్త పరిపాలన సాగుతోందని ఆరోపించారు. అరాచాకాల్లో ఆఫ్హనిస్తాన్ ను, అప్పుల్లో శ్రీలంకను మించిపోయిందన్నారు. తాము ఒకే పేజీతో మేనిఫెస్టో ఇచ్చామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని కానీ నవరత్నాలతో పాటు జగన్ ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీలన్నీ లెక్కవేసుకుంటే వందలాది హామీలు ఉంటాయన్నారు. సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం లాంటి కీలక అంశాలను విస్మరించారని చెప్పారు. మెడలు వంచుత్నానన్న సిఎం జగన్ ఢిల్లీ వెళ్లి మెడలు వంచి వస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయకత్వంలో సేవ్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గంటా అన్నారు.