ధూప దీప నైవేద్యం కింద దేవాలయాల నిర్వహణకు అర్చకులకు ప్రతినెలా ప్రభుత్వం ఇస్తున్న 6వేల రూపాయలను 10 వేలకు పెంచుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3645 దేవాలయాలకు ఈ పథకం వర్తిస్తోందని, వీటికి అదనంగా 2796 ఆలయాలకు కూడా దీన్ని విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేదం శాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న గౌరవ భ్రుతిని 2,500 నుంచి 5 వేల రూపాయలకు పెంచుతూ… దీని అర్హత వయస్సును 75 ఏళ్ల వయస్సును 60 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. గోపనపల్లిలోని నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర తో కలిసి సిఎం కేసిఆర్ ప్రారంభించారు. వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రెండు లక్షల రూపాయలను ఇకనుంచి వార్షిక గ్రాంటుగా ఇస్తామని చెప్పారు. ఐబిఎం, ఐఐఎం లాంటి ఉన్నత సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్ మెంట్ పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం ప్రసంగిస్తూ బ్రాహ్మణులపై వరాల జల్లు కురిపించారు. 9 ఎకరాల స్థలంలో 12 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని అద్భుతంగా నిర్మించామని కేసిఆర్ తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ సదన్ నిర్మించడం ద్వారా తెలంగాణా ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, తద్వారా సనాతన సంస్కృతి కేంద్రంగా దీన్ని నిర్మించిన ఘనత దేశంలో మన ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆధ్యాత్మిక, ధార్మిక,. వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తుందని, రాష్ట్రానికి వచ్చే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం నిలుస్తుందని చెప్పారు. బ్రాహ్మణ కళ్యాణాలకు ఉచితంగా ఇచ్చేందుకు దీనిలోని మండపం ఉపయోగపడుతుందని అన్నారు. కులమతాలకు అతీతంగా, పేదవారు తమ ఇంట్లో వైదిక కార్యక్రమాలకు పురోహితులను కోరితే ఈ సదనం నుంచి వారు వెళ్లి ఉచితంగా సేవలు అందించి రావాలని సిఎం ఆకాంక్షించారు. అనువంశిక అర్చకుల సమస్యలను కూడా త్వరలో కేబినెట్ లో చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. “సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా, పురాణేతిహాసాల విజ్ఞాన సర్వస్వంగా, వైదిక క్రతువుల కరదీపికగా…. పేద బ్రాహ్మణుల ఆత్మ బంధువుగా, కళ్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ విప్రహిత వెలుగొందాలని ఆ దేవ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.