వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తును కొంతమంది ప్రభావితం చేస్తున్నారని ప్రభుత సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ, వారి కోణంలోనే సిబిఐ తన దర్యాప్తును నడిపించేలా టీవీల్లో చర్చలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా పరిధి దాటి ప్రవర్తిస్తోందని, వ్యవస్థలను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ, డబ్బు మూటలు అందాయంటూ కూడా కొందరు వ్యాఖ్యలు చేశారని, దీనిపై ఈరోజు న్యాయస్థానం నోటీసులుకూడా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరుపై స్పందించారు. సిబిఐ దర్యాప్తు తీరువల్లే బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
న్యాయస్థానాలు స్వతంత్రంగా ఉంటాయన్న కనీస సూత్రం పాటించకుండా సిఎం జగన్ ఢిల్లీ పర్యటనలపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ పెద్దల ద్వారా జగన్ న్యాయస్థానాన్ని ప్రభావితం చేస్తున్నారంటూ మాట్లాడడం దిగజారుడుతనమన్నారు. వివేకా హత్యకేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఎవరికి టికట్టు ఇస్తే పార్టీకి ఉపయోగం అన్నది దృష్టిలో ఉంచుకొని జగన్ టిక్కెట్లు ఇస్తారని, కానీ టికెట్ కోసం హత్య జరిగిందని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆస్తి, కుటుంబ వ్యవహారాల కోణంలో దర్యాప్తు జరగలేదని, సిబిఐ కూడా కేవలం ఒకే కోణంలో దర్యాప్తు ఇప్పటివరకూ చేసిందనేది తమ అభిప్రాయమని వివరించారు.
దస్తగిరి వెనుక చంద్రబాబు, రాధా కృష్ణ, ఢిల్లీలో ఉన్న ఒక ఎంపి, ఇంతకుముందు ఉన్నత పదవులు నిర్వహించిన వారు ఉండి నడిపిస్తున్నారని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. వారంతా నేరుగా వెనుక ఉండకపోయినా ఓ సైకిల్ లా, వ్యవస్థీకృతంగా పని చేస్తుంటారని చెప్పారు. సిఎం జగన్ పై ఓ పాశుపతాస్త్రంగా ఈ కేసును ఉపయోగించాలని చూస్తున్నారని, దీనికి అతణ్ణి ఓ పావుగా వాడుకుంటున్నారని అన్నారు.