ఒడిశా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి భువనేశ్వర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతబొమ్మాలి మండలం ఎం కొత్తూరు గ్రామానికి చెందిన కె.రూపను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఎడమ చేతికి తీవ్ర గాయం అయిందని, చికిత్స చేయవలసిన అవసరం ఉంటుందని డాక్టర్లు అమర్నాథ్ కు చెప్పారు. అలాగే ఎడమ చేతికి కూడా తీవ్ర గాయం అయిందని తెలియజేశారు. వెంటనే ఆమెను విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు కటక్ లోని ప్రభుత్వ అతిథి గృహంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో అమర్నాథ్ బేటీ అయ్యారు. ప్రమాదం దుర్ఘటనపై వీరు కొద్దిసేపు చర్చించుకున్నారు. ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల గురించి అమర్నాథ్ కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, బంధువుల ఆచూకీ తెలియని వారు, వారి ఫోటోలు నేరుగా కంట్రోల్ రూమ్ కు వాట్సాప్ ద్వారా పంపిస్తే, సదరు వ్యక్తుల సమాచారాన్ని బంధువులకు వీలైనంత త్వరగా అందజేసే ప్రక్రియను చేపట్టామని వివరించారు.
దీనిపై స్పందించిన. కేంద్ర మంత్రి…. గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం రైల్వే శాఖ మాత్రమే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడాన్ని తాను తొలిసారిగా వింటున్నానని చెప్పారు. ఇటువంటి సహాయక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాను అభినందిస్తున్నానని వైష్ణవ్ చెప్పారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తన వెంట ఉన్న అధికారులను పిలిచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలపై వివరాలు నమోదు చేసుకోవాలని అశ్విని సూచించారు. అలాగే ఘటన జరిగిన వెంటనే ముగ్గురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి సహాయక చర్యలలో నిమగ్నం చేయడం పట్ల కూడా కేంద్ర మంత్రి అభినందించారు.