ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని… పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు రెండూ కలిసే వస్తాయని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తుకోసం, వారి అండ కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని, కానీ తమకు ఆ అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాము బలంగా ఉన్నామని, వేరే పార్టీల గురించి తమకు అనవసరమని అన్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెద్దరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.
అంగ వైకల్యం ఉన్నవారు ఎవరో ఒకరి ఆసరా లేకుండా నడవలేరని… బాబుది రాజకీయ వైకల్యమని, ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరి సహాయం లేకుండా పోటీ చేయలేరని విమర్శించారు. ఢిల్లీ వెళ్లి పొత్తుల కోసం అందరినీ దేహీ అని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్లాస్టిక్ కు నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను ఇప్పటికే నిషేధించామని గుర్తు చేశారు. మిషన్ లైఫ్ ప్రోగ్రాం అమలులో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. కాలుష్య నివారణ ప్రభుత్వ ప్రాదాన్యతాంశమని పేర్కొన్నారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తున్నామన్నారు.