Friday, November 22, 2024
HomeTrending Newsతాలిబాన్ కు పాక్ కొత్త భాష్యం

తాలిబాన్ కు పాక్ కొత్త భాష్యం

తాలిబాన్ అంటే ఉగ్రవాదులు కాదని వారు కూడా సాధారణ పౌరులేనని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కొత్త బాష్యం చెప్పారు. సాయుధులైన కొంత మందిని చూపి అందరు ఉగ్రవాదులే అనటం సమంజసం కాదని వివరించారు. పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో సుమారు ఐదు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఉన్నారని, అందులో ఎవరు ఉగ్రవాదులో కనుక్కోవటం కష్టమన్నారు. ఎంతోమంది అమాయక ప్రజలు శరణార్ధులుగా ఉన్న శిబిరాలను ఉగ్రవాద నిలయాలని ఎలా ప్రకటిస్తామని ఇమ్రాన్ ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ లో ప్రశ్నించారు.

పాకిస్తాన్ తాలిబాన్ ఉగ్రవాదుల స్వర్గధామంగా ఉందన్న వాదనలపై ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది శరణార్థి శిబిరాల్లో ఉంటున్నారని, ప్రాణభయంతో వచ్చి తలదాచుకుంటున్న వారిని ఉగ్రవాదులుగా జతకట్టడం సరికాదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది పష్టున్ తెగకు చెందిన వారని, పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో జన్మతః పష్టున్ లు ఎక్కువగా ఉన్నారని, తాలిబాన్ కోసం పనిచేసేవారు కూడా పష్టున్ లే అని ప్రధానమంత్రి వివరించారు.

తాలిబాన్ కు మిలిటరీ పరంగా, ఆర్ధిక సాయం, పాక్ నిఘా వర్గాల అండదండలు ఉన్నాయనే ఆరోపణలని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబాన్ కు సహకారం అందిస్తే పాకిస్తాన్ కు వచ్చే ప్రయోజనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైన ఆరోపణలతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. న్యూయార్క్ పై సెప్టెంబర్ 11 దాడుల తర్వాత పాకిస్తాన్ కు సంబంధం లేకపోయినా నష్టపోయామని, ఆఫ్ఘన్ లో జరిగిన యుద్ద ప్రభావంతో వేల మంది పాక్ పౌరులు చనిపోయారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్