సిఎం జగన్ ఆదేశాలతో ఒక నెల ముందుగానే కృష్ణాడెల్టా పొలాలకు సాగునీరు విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. దీనివల్ల ఏటా మూడు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. తొలిదశలో వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. జూన్ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో డెల్టాకు నీరు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోందని, కానీ సిఎం సూచనతో… రైతుల శ్రేయస్సు కోసం ముందే నీరు విడుదల చేస్తున్నామన్నారు, గత ఏడాది కూడా జూన్ 10న నీరు వదిలామని, ఈ ఏడాది 7వ తేదీనే విడుదల చేస్తున్నామని వివరించారు. దీని ద్వారా ఖరీఫ్ ముందే మొదలవుతుందని, పంటలు ముందే పండి… గాలి, వానలు, తుఫాన్లు వచ్చే సమయానికి పంట ఇంటికి చేరుకుంటుందని అన్నారు. గోదావరి డెల్టాకు కూడా జూన్ 1న నీరు విడుదల చేశామని చెప్పారు. పులిచింతలలో 34 టిఎంసిల నీరు నిల్వ చేసి రైతులకు అందిస్తున్నామన్నారు. పట్టిసీమ నుంచి నీరు తీసుకు రావాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు.
విజయవాడ కృష్ణా బ్యారేజ్, బకింగ్ హం కాలువ వద్ద కృష్ణాడెల్టా పరిధిలోని షుమారు 13 లక్షల ఎకరాలకు 2023 ఖరీఫ్ కు నీటిని మంత్రి అంబటి విడుదల చేశారు. ముందుగా కృష్ణా నదికి హారతి ఇచ్చిన అనంతరం వేదమంత్రాలు మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.