ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన చివరి వన్డేలో శ్రీలంక 9 వికెట్లతో ఘనవిజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్ లో లంక బౌలర్లు సమిష్టిగా రాణించి ఆఫ్ఘన్ ను 116 పరుగులకే కట్టడి చేశారు. ఈ లక్ష్యాన్ని లంక ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది.
హంబంతోట లోని మహీంద్ర రాజపక్ష స్టేడియంలో నేడు ఆఫ్ఘన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 13 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టు 48 పరుగులకు మొత్తం నాలుగు వికెట్లు సమర్పించుకుంది. జట్టులో నబి చేసిన 23 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇబ్రహీం జర్దాన్ -22; గుల్బడిన్-20 పరుగులు చేశారు. 22. 2 ఓవర్లలో 116 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. దుష్మంత చమీర 4 వికెట్లతో సత్తా చాటగా… వానిందు హసరంగ 3; లాహిరు కుమార 2; మహీశ తీక్షణ 1 వికెట్ పడగొట్టారు.
శ్రీలంక తొలి వికెట్ కు 84 పరుగులు చేసింది. పాథుమ్ నిశాంక 34 బంతుల్లో 8ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నే 45 బంతుల్లో 7 ఫోర్లతో 56; కుశాల్ మెండీస్-11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడు వన్డేల సిరీస్ ను శ్రీలంక 2-1తో గెల్చుకుంది.
దుష్మంత చమీర ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు, ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ కూడా దక్కించుకున్నాడు.