వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇండియా టాపార్డర్ ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ-15; శుభ్ మన్ గిల్-13; చతేశ్వర్ పుజారా-14; విరాట్ కోహ్లీ-14 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. ఆల్ రౌండర్ జడేజా 48 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన అజింక్యా రెహానె- 29; శ్రీకర్ భరత్-5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ జట్టులో ఐదుగురు బౌలర్లు స్టార్క్, బొలాండ్, పాట్ కమ్మిన్స్, కామెరూన్ గ్రీన్, నాథన్ లియాన్ తలా ఒక వికెట్ సాధించారు.
మొదటిరోజు 146 పరుగులతో క్రీజులో ఉన్న ట్రావిస్ హెడ్ 163, స్టీవెన్ స్మిత్ 121 రన్స్ సాధించి ఔటయ్యారు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ ఒక్కడే 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 48 పరుగులు చేసి రాణించాడు. 469 పరుగుల వద్ద ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో సిరాజ్ 4; షమీ, శార్దూల్ ఠాకూర్ చెరో 2; జడేజా ఒక వికెట్ సాధించారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 318 పరుగులు వెనకబడి ఉంది.