Creative Liberty: “మరలనిదేల రామాయణంబన్న?” అని తనను తానే ప్రశ్నించుకుని…“నావయిన భక్తి రచనలు నావిగాన…” అని తానే సమాధానం కూడా చెప్పుకున్నాడు తెలుగులో మెదటిసారి జ్ఞానపీఠం అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షానికి ముందు మాటలో.
కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, ఒంటిమిట్ట వాసుదాసు రామాయణం…ఇలా నన్నయ్య, తిక్కనలనుండి మొన్న మొన్నటి పుల్లెల శ్రీరామచంద్రుడి వచనానువాదం దాకా తెలుగులో లెక్కలేనన్ని రామాయణాలు. అలాగే మిగతా భారతీయ భాషల్లో కూడా రామాయణ కావ్యాలెన్నో లెక్కే లేదు.
కాళిదాసు అంతటివాడు రఘువంశం రాస్తూ… “వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ముందు నా రచన ఏపాటి? పొట్టి చేతులవాడిని…ఎత్తయిన చెట్టు ఫలాలు అందుకోవాలని ఆశపడుతున్నాను” అని అత్యంత వినయంగా చెప్పుకున్నాడు.
“పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?” అని తెలుగు భాషను, తెలుగు పద్యాన్ని మంత్రమయం చేసిన మన పోతన చెప్పుకున్నాడు.
మన భద్రాద్రి రామయ్యను చూస్తూ కంచెర్ల గోపన్న అల్లిన కీర్తనల్లో, పద్యాల్లో ఉన్నదంతా రామాయణమే. తమిళగడ్డ మీద తేట తెలుగులో అయోధ్యరాముడితో మన త్యాగయ్య మాట్లాడినదంతా రామాయణమే. తెలుగు పదకవితా పితామహుడు అన్నమయ్య వెంకన్నలో రాముడిని చూస్తూ పరవశించి పాడినదంతా రామాయణమే.
పల్లవి:-
ఇదే శిరసు మాణిక్యమిచ్చి పంపె నీకు నాకె
అదనెరిగి తెచ్చితిని అవధరించవయ్యా!
చరణం-1
రామా నిను బాసి నీ రామా నే చూడగ ఆ
రామమున నిను పాడెను రామ రామ యనుచు
ఆ మెలుత సీతయని అపుడు నే తెలిసి
నీ ముద్ర ఉంగరము నేనిచ్చితిని
చరణం-2
కమలాప్తకులుడా నీ కమలాక్షి నీ పాద
కమలములు తలపోసి కమలారిదూరె
నెమకి ఆలేమను నీ దేవియని తెలిసి
అమరంగ నీ సేమమటు విన్నవించితిని
చరణం-3
దశరధాత్మజా నీవు దశశిరుని చంపి
ఆ దశనున్న చెలిగావు దశ దిశలు పొగడ
రసికుడ శ్రీ వెంకట రఘువీరుడా నీవు
శశిముఖి చేకొంటివి చక్కనాయె పనులు
32 వేల అన్నమయ్య కీర్తనల్లో మనకు దొరికినవి దాదాపు పదిహేను వేలు. మిగిలిన రాగిరేకులు దొరకక కాలగర్భంలో కలిసిపోయాయి. దొరికినవాటిలో రామాయణంలో సీతమ్మ జాడ కనుక్కుని…రాముడి ఉంగరం ఆ తల్లికి ఇచ్చి…ఆమె గుర్తుగా ఇచ్చిన శిరసు మాణిక్యాన్ని (నెత్తిన పాపిట మధ్య పెట్టుకునే ఆభరణం) రాముడికి హనుమంతుడు ఇస్తున్న సందర్భాన్ని తెలిపే పద చిత్రమిది.
“ఓ స్వామీ!
సీతమ్మ క్షేమంగా ఉంది. నీ క్షేమం అడగమంది.
ఇదిగో సీతమ్మ శిరసు మాణిక్యం తెచ్చాను. నీకు దూరమై లంక ఆరామాల్లో రామా! రామా! అని విలపిస్తున్న సీతమ్మను గుర్తు పట్టి నీవిచ్చిన ఉంగరం ఇచ్చాను. పదే పదే నిన్ను తలచుకుంటున్న ఆ తల్లికి నీ క్షేమ సమాచారాన్ని విన్నవించాను.
ఓ దశరథ కుమారుడా!
నువ్వు త్వరగా ఆ దశలో ఉన్న దశకంఠుడిని చంపి…దశ దిశలు పొగుడుతుండగా సీతమ్మను క్షేమంగా తీసుకురా! స్వామీ!”
ఈ మాటలు వాల్మీకి రామాయణంలో లేనే లేవు. కానీ వాల్మీకి కంటే ఈ సందర్భాన్ని అన్నమయ్య అద్భుతంగా ఆవిష్కరించాడు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కో కవి భావనా పటిమ, వైశాల్యం, సాంద్రత, భావావిష్కారం ఒక్కోలా ఉంటుంది. అందుకే మనం వాల్మీకి మాటను పారాయణ చేస్తాం. అన్నమయ్య మాటను పరవశించి పాడుకుంటాం. వాల్మీకి దారిలోఒక్క అంగుళం కూడా పక్కకు తప్పకుండా అదే రామాయణాన్ని అంతే రమ్యంగా చెప్పారు కాబట్టే…పిబరే రామరసం అని భక్తి పారవశ్యంతో మిగిలిన రామాయణాలను కూడా మనం నెత్తిన పెట్టుకుని తరతరాలుగా పూజిస్తున్నాం.
ఇంతటి పవిత్రమయిన రామాయణం నాటకం, సినిమావారి చేతుల్లో పడి మొదట జనసామాన్యానికి దగ్గరయ్యింది. ఇప్పుడు అదే సినిమావారి వల్ల రామాయణానికి పెద్ద చిక్కొచ్చి పడింది.
మొదట వాల్మీకికి రామాయణాన్ని క్లుప్తంగా నారదుడు చెప్తాడు. దీన్నే సంక్షేప రామాయణం అంటున్నాం. తరువాత ఆయా పాత్రల మనసులో ఏమున్నది కూడా నీకు తెలిసే వరమిస్తున్నాను…అని బ్రహ్మ అభయమిస్తే…అప్పుడు వాల్మీకి రామాయణ రచన మొదలుపెడ్తాడు.
ఇప్పుడు సినిమావారే బ్రహ్మకు అభయమిస్తున్నారు. వారి మనసులో అనుకున్నదే బ్రహ్మ లోకానికి…పనిలో పనిగా రామాయణాన్ని రీ రైట్ చేయమని వాల్మీకికి చెప్పాలి అన్నట్లుంది పరిస్థితి. తాజాగా హిందీ రంగు, రుచి, వాసనలు దట్టించిన ఆదిపురుష్ ట్రయిలర్లు చూశాక ప్రతి థియేటర్లో “రిజర్వుడు” సీట్లోకి ఏకకాలంలో ఎలా వచ్చి కూర్చోవాలో తెలియక హనుమంతుడు నిలువెల్లా వణికిపోతున్నాడు.
“రామనామాంకిత అంటే రాముడి పేరు ఉన్న బంగారు ఉంగరాన్ని హనుమ సీతమ్మకు ఇచ్చాడు. ప్రతిగా సీతమ్మ శిరసు మాణిక్యాన్ని రాముడికి ఇవ్వడానికి తీసుకున్నాడు” అని స్పష్టంగా వాల్మీకి రామాయణం సుందరకాండలో ఉంది.
“ఏష చూడామణిర్దివ్యో మయా సుపరిరక్షితః
ఏతం దృష్ట్వా ప్రహృష్యామి వ్యసనే త్వామివానఘ’’
‘‘ఏష నిర్యాతిత శ్శ్రీమాన్ మయా తే వారిసంభవః
అతః పరం న శక్ష్యామి జీవితుం శోకలాలసా’’
సముద్రుడు వరుణుడికి ఇస్తే, వరుణుడు జనకుడికి ఇస్తే, జనకుడు తన భార్య చేతుల మీదుగా మిథిలానగర పెళ్లి మండపంలో…దశరథుడి సమక్షంలో పెళ్లికూతురు సీతమ్మ తలలో అలంకరించిన చూడామణి అది. అందుకే దాన్ని చూసినప్పుడల్లా రాముడు గుర్తొస్తుంటాడు. అది లేకుండా బతకలేను. అలాంటి చూడామణిని గుర్తుగా ఇస్తున్నాను అని ఎంతో ఆవేదనతో సీతమ్మ చెప్పిన మాటను వాల్మీకి రికార్డు చేశాడు. ఇది భారతదేశంలో ఉన్న వేనవేల రామాయణాల్లో కూడా అంతే ఆర్ద్రంగా, అలాగే ఉంది. అన్నమయ్య ఏకంగా దీనిమీద ఒక పాటే రాసి…రాగం కట్టి…పాడి…అపురూపమయిన ఆ శిరసుమాణిక్య పదాన్ని మన చేతుల్లో పెట్టాడు.
మన హిందీ ఆదిపురుషులకు మాత్రం చూడామణి అంటే చేతి గాజు అయ్యింది. చిన్న చిన్న విషయాల్లో ఇంత అజాగ్రత్త ఎందుకో? అయిదు వందల కోట్లు ఖర్చు పెట్టినవారు అయిదు వందలు పెట్టి ఒక వాల్మీకి రామాయణం అర్థ తాత్పర్యాల పుస్తకాల సెట్టు కొని చూసుకోలేకపోయారు.
కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు వేరు వేరు. సీతాన్వేషణకు ఏవేవి ఎన్నెన్ని కోట్ల సంఖ్యలో ఏయే వైపు వెళ్లాలో సుగ్రీవుడు కిష్కింధకాండలో సరిగ్గా కాగితం మీద రాసి లెక్క ఇచ్చాడు. ఆదిపురుష్ ట్రయిలర్లలో మనం చూస్తున్నది కోతా? కొండముచ్చా? ఎలుగుబంటా? ఇవేవీ కాని కొత్త జంతువా? అన్నది తెలియడానికి వీలుగా కింద టైటిల్ కూడా వేస్తే బాగుండేది.
హే రామ్!
ఏ సిర్ఫ్ ట్రయిలర్ హై.
అభీ బహుత్ లంబా హుప్ హుప్పు హుయ్యా పిక్చర్ బాకీ హై!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018