భారతీయ జనతా పార్టీ పాత్ర ఉన్న ప్రభుత్వమే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజ్య సభ్య సభ్యుడు, బిజెపి నేత సిఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను చంద్రబాబు రాజకీయంగా కలిశారా లేదా అనేది వారిద్దరే చెప్పాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అమిత్ షాను దేశ వ్యాప్తంగా ఎందరో నేతలు కలుస్తుంటారన్నారు. బిజెపి వేరు, ప్రభుత్వం వేరని… ఒక సిఎంగా జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తారని అన్నారు. విశాఖ బిజెపి కార్యాలయంలో పార్టీ నేతలు విష్ణు కుమార్ రాజు, పీవీఎన్ మాధవ్ లతో కలిసి సిఎం రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
పొత్తుల గురించి మాట్లాడే అధికారం రాష్ట్ర స్థాయి నేతలకు లేదన్నారు. కేంద్ర నాయకత్వం మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సరైన సమయంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జూన్ 11న అమిత్ షా వైజాగ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని, తొమ్మిదేళ్ళ మోడీ పాలనలో దేశం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తారని… రేపు 10న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకాళహస్తిలో జరిగే సభలో పాల్గొంటారని సిఎం రమేష్ చెప్పారు. విశాఖలో జరుగుతున్నది పార్టీ కార్యక్రమం కాబట్టి జనసేన ను ప్రత్యేకంగా ఆహ్వానించలేదని వివరణ ఇచ్చారు.
అనతరం అమిత్ షా బహిరంగ సభ పోస్టర్ ను నేతలు విడుదల చేశారు.