Tuesday, November 26, 2024
HomeTrending NewsAmith Shah: 20 ఎంపీ సీట్లు ఇవ్వండి: అమిత్ షా పిలుపు

Amith Shah: 20 ఎంపీ సీట్లు ఇవ్వండి: అమిత్ షా పిలుపు

నాలుగేళ్ల పాలనలో అవినీతి, కుంభకోణాలు  సిఎం జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడోస్థానంలో ఉందని అన్నారు. దేశంలో 12 కోట్ల మంది రైతులకు 6 వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఇస్తుంటే… రైతు భరోసా పేరుతో తాను ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  బిజెపి జన సంపర్క్ అభియాన్ లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన బహిరంగసభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. వైసీపీ నేతలు విశాఖలో భూదందా చేస్తున్నారని ఆరోపించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్, రాష్ట్ర వాటా నిధుల కింద 2014-19 కాలంలో 2 లక్షల 30 కోట్ల రూపాయలు ఇచ్చామని, మొత్తం తొమ్మిదేళ్ళలో ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని అయితే అభివృద్ధి మాత్రం జరగలేదని, ఈ నిధులన్నీ ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. కేవలం 4 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఏపీలో ఉంటే మోడీ హయంలో అది 9 వేల కిలోమీటర్లకు చేరుకుందన్నారు. దీనికోసం 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి రెండు వందే భారత్ రైళ్ళు కేటాయించామన్నారు. వైజాగ్ రైల్వే స్టేషన్ ను 450 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నామని, కడప ఎయిర్ పోర్ట్ ను తిరిగి ప్రారంభించామని వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేసిందని గుర్తు చేశారు.

ఉజ్వల పథకం ద్వారా13 కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, 10 కోట్ల గృహాల్లో మరుగుదొడ్లు నిర్మించామని, ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించామని వివరించారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న 80 కోట్ల మందికి ప్రతినెలా ఒక్కో వ్యక్తికీ ఉచితంగా బియ్యం ఇస్తున్నామని తెలిపారు.  కానీ ఈ రేషన్ పంపిణీలో కూడా జగన్ తన ఫోటో పెట్టుకుంటున్నారని అమిత్ షా అన్నారు. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించామన్నారు.

మోడీ హయంలో ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రతిష్ట ఎంతో పెరిగిందని, ఆయన ఎక్కడకు వెళ్ళినా అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇది మోదీకో, బిజేపికో దక్కుతున్న గౌరవం మాత్రమే కాదని, ఏపీతో పాటు 130 కోట్ల దేశ జనాభాకు లభిస్తోన్న గౌరవమని అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు బిజెపి నేతలు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారని, దానిలో భాగంగానే తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ లో 25 ఎంపి సీట్లలో 20 సీట్లు మోడీకి బహుమతిగా అందించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.  పదేళ్ళ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల రూపాయాల అవినీతి జరిగిందని, కానీ మోడీ పాలనలో ఇంతవరకూ ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని స్పష్టం చేశారు.  దేశ భద్రత విషయంలో రాజీ ప్రసక్తే లేదని… పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామా దాడి జరిగితే వారంరోజుల్లోపే సర్జికల్ స్ట్రైక్ చేసి మన సత్తా చూపించామని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్