Monday, September 23, 2024
HomeTrending NewsYS Jagan: ఇప్పుడు డిక్లరేషన్ ఏమిటి? బాబుపై జగన్ ధ్వజం

YS Jagan: ఇప్పుడు డిక్లరేషన్ ఏమిటి? బాబుపై జగన్ ధ్వజం

బిజెపిని తాను నమ్ముకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుడి దయను, ప్రజల ఆశీస్సులను మాత్రమే తాను నమ్ముకున్నానని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న విశాఖలో చేసిన వ్యాఖ్యలు, మొన్న జేపీ నడ్డా విమర్శలు, ఇటీవల ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు భేటీ నేపథ్యంలో సిఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ళలో చదివే విద్యార్ధులకు యూనిఫాం, పుస్తకాలతో పాటు తొమ్మిది రకాల వస్తువులు అందించే ‘జగనన్న విద్యా కానుక’ను నాలుగో ఏడాది పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో సిఎం జగన్ నేడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మరోసారి అవకాశం ఇస్తే మయసభ చేస్తానని, ఇంటింటికీ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తానంటూ బాబు మోసం చేస్తున్నారని, వీటిని మనం నమ్మొచ్చా అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. బాబు పెత్తందారీ భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి…. మన సామాజిక న్యాయానికి-వారి సామాజిక అన్యాయానికి… ఎల్లో మీడియా విష ప్రచారానికి, మన ప్రభుత్వం ఇంటింటికీ చేసిన మంచికి మధ్య యుద్ధం జరుగుతోందని సిఎం అన్నారు. వారు ఈ యుద్ధం చేస్తోంది జగన్ తో కాదని, పేదలతో అంటూ జగన్ పేర్కొన్నారు. ‘కురుక్షేత్ర మహా సంగ్రామంలో నా ధైర్యం మీరు- నా బలం ఇంటింటికీ మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి గర్వపడుతున్నా’ అని భావోద్వేగంతో చెప్పారు.

మూసేయడానికి సిద్ధంగా ఉన్న ఈ టిడిపి..  హామీల పేరుతో… పక్క రాష్ట్రంలోని మేనిఫెస్టోలను బిసిబిల్లా బాత్ రూపంలో తీసుకొచ్చి , వాటికి ఇప్పటికే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను జోడించి కిచిడీ చేసి… పులిహోర వండుతున్నారని దుయ్యబట్టారు. 28 ఏళ్ళ క్రితం సిఎం పదవి చేపట్టి,  మొత్తంగా 14 ఏళ్ళపాటు సిఎం గా పనిచేసిన బాబు ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్, బిసి డిక్లరేషన్ అని చెబుతున్నారని, ఇన్నాళ్ళూ గాడిదలు కాశారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. చివరకు గ్యాస్ సిలెండర్ల డిక్లరేషన్  కూడా తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వమని, పేదలకు వ్యతిరేకమని, నిరుపేదల పిల్లలు ట్యాబ్ లు పట్టుకుని చదువుకుంటే ఆయన ఓర్చుకోలేరని  జగన్ మండిపడ్డారు. చంద్రబాబు బతుకే మోసం, ఒక పెద్ద అబద్దం, ఆయన పేదలకు వ్యతిరేకం అంటూ నిప్పులు చెరిగారు. 14 ఏళ్లు సిఎం గా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఓ ఒక్క పథకమూ గుర్తుకు రాదన్నారు. అయన పేరు చెబితే వెన్నుపోటు, మోసం, కుట్ర,దగా ఇవే గుర్తుకువస్తాయన్నారు. మీ కుటుంబాలకు మంచి జరిగితే తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్